Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్లను త‌రిమికొట్టిన మంత్రి అనుచ‌రులు

By:  Tupaki Desk   |   26 July 2016 7:23 AM GMT
త‌మ్ముళ్లను త‌రిమికొట్టిన మంత్రి అనుచ‌రులు
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌నే అభిప్రాయం ఉన్న తెలుగుదేశం పార్టీలో త‌మ్ముళ్లు హ‌ద్దులు మీరుతున్నారు. ఏకంగా పిడిగుద్దుల‌కు పాల్ప‌డ్డారు. అది కూడా సాక్షాత్తు స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో కావ‌డం ఆస‌క్తిక‌రం. పైగా దాడికి పాల్ప‌డింది మంత్రి రావెల కిశోర్ బాబు మ‌నుషులు కావ‌డంతో వివాదం జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చే వ‌ర‌కు వెళ్లింది. ప్రకాశం జిల్లా చీరాలలోని రాజకీయాలు ఇలా మ‌రోసారి తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ - నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ సునీత వర్గీయుల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. ఇలాంటి తరుణంలో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయం కమిటీ సమావేశం తీరు దానికి ఆజ్యం పోసినట్టయింది.

ప్ర‌కాశం జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశం పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన సునీతవర్గం నేతలు తమను స్థానిక ఎమ్మెల్యే ఆమంచి వేధిస్తున్నారని - ప్రోటోకాల్ పాటించడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు - జిల్లా ఇన్‌ చార్జి మంత్రి మంత్రి రావెల కిశోర్‌ బాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే తరువాత మాట్లాడతానని సర్ధిచెప్పారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత కూడా తమ సమస్యను వినకుండా వెళ్తున్న మంత్రి రావెల కారును సునీత వర్గం నాయకులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ వెనుక ఉన్న మంత్రి రావెల అనుచరులు ఒక్కసారిగా కిందకు దిగి మహిళలు - పురుషులని తేడా లేకుండా దారుణంగా కొట్టారు.

ఈక్రమంలో చీరాల మండలంలోని విజయలక్ష్మిపురానికి చెందిన పాపంచి రాంబాబుకు కాలువిరగటంతో పోలీసులు అతన్ని రిమ్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఒంగోలు -చీమకుర్తి రహదారిపై నేతలు రాస్తారాకో చేపట్టడటంతో రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయ.

ఈసందర్భంగా ప‌లువురు టీడీపీ నేత‌లు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టిన సునీత వర్గానికి చెందిన తమను పిలవటంలేదన్నారు. 35సంవత్సరాలనుండి పార్టీ జెండా మోసిన తమకు గుర్తింపులేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను స్వయంగా జిల్లా ఇన్‌ చార్జీమంత్రికి వినతిపత్రం రూపంలో ఇచ్చి తమ గోడును వెల్లబుచ్చుకునేందుకు వస్తే తమను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అడ్డగించే తమను మంత్రి అనుచరులు పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. ఇలాంటిమంత్రిని కేబినేట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రైవేటు సిబ్బంది చేసిన నిర్వాహకానికి నిరసనగా మంగళవారం చీరాల బంద్‌ కు పిలుపునిచ్చామని ప్ర‌క‌టించారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు దామచర్ల జనార్ధన్ స్పందించి రాస్తారాకో చేస్తున్న టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. వచ్చేనెల రెండవవారంలో సమావేశం ఏర్పాటుచేసి ఇరువర్గాల నేతలను పిలిపించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.