Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిన రవి ప్రకాష్, శివాజీ?

By:  Tupaki Desk   |   16 May 2019 5:36 AM GMT
అడ్డంగా దొరికిన రవి ప్రకాష్, శివాజీ?
X
ఫోర్జరీ వ్యవహారం, నిధుల బదలాయింపుతో సహా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి టీవీ 9 నూతన యాజమాన్యానికి ఇబ్బందులను సృష్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రవి ప్రకాష్ కు సంబంధించి కీలకమైన ఆధారాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. వివిధ ఆరోపణలతో టీవీ నైన్ నూతన యాజమాన్యం రవి ప్రకాష్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఫిర్యాదుల్లో ఒక్కొక్క అంశం గురించి కూపీ లాగుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రకాష్- శివాజీల మధ్యన జరిగిన ఒప్పందం నకిలీది అనేందుకు సంబంధించిన కీలక ఆధారాలను సంపాదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. రవి ప్రకాష్, శివాజీల కు సంబంధించిన మెయిల్స్ ను ట్రేస్ చేసి అసలు విషయాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఆ మెయిల్స్ ను రవి ప్రకాష్, శివాజీలు సర్వర్ల నుంచి కూడా డిలీట్ చేయించినా, సైబర్ క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాత గుట్టంతటినీ బయట పెట్టారని వార్తలు వస్తున్నాయి.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ను అడ్డం పెట్టుకుని టీవీ నైన్ షేర్స్ ను నూతన యాజమాన్యం నుంచి కొత్త యాజమాన్యానికి చేతులు మారే ప్రక్రియను దెబ్బతీయాలని రవి ప్రకాష్ ప్రయత్నించాడని అంటారు. అందుకు తన సన్నిహితుడు శివాజీని వాడుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. రవి ప్రకాష్ తన షేర్స్ లోని కొన్నింటిని శివాజీకి అమ్మినట్టుగా, వాటి బదలాయింపు చేయనట్టుగా శివాజీ వెళ్లి ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేయడంతో టీవీ నైన్ అమ్మకం ప్రక్రియే ఆగిపోయే పరిస్థితి వచ్చిందని అంటారు.

ఇదంతా రవి ప్రకాష్ కావాలని సృష్టించిన హార్డిల్ అని, తన సన్నిహితుడు అయిన శివాజీతో ఆ నాటకం ఆడిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.వాస్తవానికి శివాజీకి రవిప్రకాష్ షేర్లు అమ్మిందే లేదు అని, పాత డేట్లతో తప్పుడు పాత్రలను సృష్టించాడనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణకు సంబంధించే ఇప్పుడు ఆధారాలు లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరి ఈమెయిల్స్ సంభాషణతో మొత్తం గుట్టు రట్టు అయ్యిందని తెలుస్తోంది.

రవి ప్రకాష్ నుంచి శివాజీ నలభై వేల షేర్లను కొన్న ఒప్పందం గత ఏడాది ఫిబ్రవరి ఇరవై న జరిగిందని డ్రాఫ్ట్ లో ఉంది. అయితే ఆ డ్రాఫ్ట్ సృష్టించారని, ఈ ఏడాది ఏప్రిల్ పదమూడున దాన్ని తయారు చేశారని తెలుస్తోంది. ఆ రోజు సాయంత్రం రవి ప్రకాష్, శివాజీల మధ్యతో పాటు మరి కొందరి మధ్యన కూడా ఇందుకు సంబంధించి ఇమెయిల్ ద్వారా సంభాషణలు జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ పద్నాలుగున శివాజీ ఎన్సీఎల్టీ వద్ద దాఖలు చేయాల్సిన పిటిషన్ కు అవసరమైన రీతితో పాత డాక్యుమెంట్ ను తయారు చేసినట్టుగా తెలుస్తోంది.

దీంతో ఇదంతా కుట్ర అని, శివాజీని అడ్డం పెట్టుకుని రవి ప్రకాష్ కుట్ర పన్నారని, టీవీ నైన్ యాజమాన్య హక్కుల బదలాయింపుకు ఆటంక పరిచేందుకే ఇదంతా చేసినట్టుగా కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి ఆధారాలు లభించినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ ఆధారాలు ఎన్సీఎల్టీ ముందుకు వెళితే అప్పుడు రవి ప్రకాష్- శివాజీలు మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.