Begin typing your search above and press return to search.

పోలీసుల విచార‌ణ‌లో ర‌విప్ర‌కాశ్ ఎలా ఉన్నారంటే?

By:  Tupaki Desk   |   5 Jun 2019 4:35 AM GMT
పోలీసుల విచార‌ణ‌లో ర‌విప్ర‌కాశ్ ఎలా ఉన్నారంటే?
X
ప‌లు కేసుల్లో చిక్కుకొని.. ఎవ‌రికి క‌నిపించ‌కుండా.. పోలీసుల కంట ప‌డ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ఎట్ట‌కేల‌కు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ కు వ‌చ్చారు. మాసిన గ‌డ్డంతో.. క‌ళ త‌ప్పిన ముఖంతో ఉన్న ఆయ‌న కారు దిగి.. అక్క‌డే ఉన్న విలేక‌రుల్లో ప‌రిచ‌య‌స్తుల్ని ప‌లక‌రించారు.

గ‌తంలో ఉన్న రాజ‌సం ఆయ‌న‌లో లేదు. ముఖంలోనూ.. న‌వ్వులోనూ జీవం లేన‌ట్లుగా ఉంది. ఖ‌రీదైన‌.. విలాస‌వంత‌మైన పోర్షే కారులో వ‌చ్చిన ఆయ‌న.. తొలి రోజు ఐదు గంట‌ల విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు. అప్ప‌టికే రాత్రి కావ‌టంతో ఆయ‌న్ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. పోలీసుల విచార‌ణ రాత్రి 9 గంట‌ల త‌ర్వాత కూడా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. ప‌లు మీడియా సంస్థ‌లు ఆయ‌న అరెస్ట్ కు సంబంధించిన వార్త‌ల్ని సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలిసింది. అయితే.. వెంట‌నే ఆయ‌న అరెస్ట్ ఉండ‌ద‌న్న‌ది విశ్వ‌స‌నీయ స‌మాచారం. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా.. ప్ర‌ముఖుల్ని ఇంట‌ర్వ్యూ చేసే వేళ‌లో.. పోలీసు విచార‌ణాధికారి అన్న‌ట్లుగా ప్ర‌శ్న‌లు సంధించే ర‌విప్ర‌కాశ్‌.. రియ‌ల్ పోలీసుల ఎదుట నిందితుడి హోదాలో ఎలా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రాధ‌మిక స‌మాచారం ప్ర‌కారం పోలీసుల విచార‌ణ‌కు ర‌విప్ర‌కాశ్ స్పందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. తాను ఇరుకున ప‌డ‌తాన‌న్న భావ‌నకు గురైన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆయ‌న జ‌వాబులు ఇవ్వ‌టం లేద‌ని తెలుస్తోంది.

కొన్నిప్ర‌శ్న‌ల‌కు నార్మ‌ల్ గా బ‌దులిస్తున్న ర‌విప్ర‌కాశ్‌.. మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు మాత్రం త‌న‌కు గుర్తు లేద‌ని.. ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌న లాయ‌ర్లు వాటికి బ‌దులిస్తార‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ముందుగా సిద్ధం చేసుకున్న ప్ర‌శ్నావ‌ళి ప్ర‌కార‌మే ర‌విప్ర‌కాశ్ ను పోలీసులు ప్ర‌శ్నించిన‌ట్లుగా చెబుతున్నారు. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు మాత్రం పొంత‌న లేని స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.