Begin typing your search above and press return to search.

బెజ‌వాడ నుంచి ర‌విప్ర‌కాశ్ ఎక్క‌డికి వెళ్లారు?

By:  Tupaki Desk   |   28 May 2019 5:25 AM GMT
బెజ‌వాడ నుంచి ర‌విప్ర‌కాశ్ ఎక్క‌డికి వెళ్లారు?
X
మోసం.. ఫోర్జ‌రీ త‌దిత‌ర నేరారోప‌ణ‌ల‌తో కేసులు న‌మోదైన టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే సైబ‌రాబాద్ పోలీసులు ఆయ‌న జాడ‌ను ప‌సిగ‌ట్టిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అప్పుడున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అరెస్ట్ విష‌యంలో కాస్తంత సాగ‌దీత ధోర‌ణిని అమ‌లు చేసిన‌ట్లుగా చెబుతారు.

ఆయ‌న‌పై వ‌చ్చిన నేరారోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ మూడుసార్లు నోటీసులు పంపినా.. ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. విదేశాల‌కు పారిపోకుండా ఉండేలా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్ప‌టికే ర‌విప్ర‌కాశ్ మీద ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ) - 72లతోపాటు - 406 - 420 - 467 - 469 - 471 - 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ర‌విప్ర‌కాశ్ కోసం సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం విభాగం.. బంజారాహిల్స్ పోలీసుల‌తో పాటు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపులు మొద‌లు పెట్టారు. ఒకప‌క్క త‌న మీద పోలీసులు కేసులు న‌మోదు చేస్తుంటే.. మ‌రోవైపు ర‌విప్రకాశ్ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యిస్తున్నారు. ఆయ‌న‌కు కోర్టు నుంచి ప్ర‌తికూల ఫ‌లిత‌మే వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఉన్నార‌ని.. ఆయ‌న‌కున్న రాజ‌కీయ అండ‌తో పోలీసుల‌కు దొరక్కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే..ర‌విప్ర‌కాశ్ జాడ‌ల్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు మ‌రింత ముమ్మ‌రం చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌విప్ర‌కాశ్ విజ‌య‌వాడ నుంచి త‌ప్పించుకొని మ‌రోచోట‌కు వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. బెంగ‌ళూరు.. ముంబ‌యి.. గుజ‌రాత్ ల‌లో ఎక్క‌డో ఒక చోట ఆయ‌న ఆశ్ర‌యం పొంది ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 30సిమ్ లు మార్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌.. పోలీసుల క‌ళ్లు క‌ప్పి ఎప్ప‌టిక‌ప్పుడు తానున్న ప్రాంతాల్ని మార్చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌మ‌కు స‌వాల్ విసురుతున్న ర‌విప్ర‌కాశ్ ను ఎట్టి ప‌రిస్థితుల్లో అదుపులోకి తీసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో తెలంగాణ పోలీసులు ఉన్నారు.