Begin typing your search above and press return to search.

కేసుల‌న్ని అందుకే.. బెయిల్ ఇవ్వాల‌న్న ర‌విప్ర‌కాశ్‌!

By:  Tupaki Desk   |   21 May 2019 5:10 AM GMT
కేసుల‌న్ని అందుకే.. బెయిల్ ఇవ్వాల‌న్న ర‌విప్ర‌కాశ్‌!
X
మోసం.. ఫోర్జ‌రీ.. డేటా చోరీతో స‌హా రూ.99వేల‌కు టీవీ9 లోగోతో పాటు మ‌రో ఐదు లోగోల్ని త‌న సంస్థ‌కు అమ్ముకున్నట్లుగా టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ మీద కేసులు న‌మోదు కావ‌టం తెలిసిందే. వీటికి సంబంధించి పోలీసు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. చివ‌ర‌కు లుక్ అవుట్ నోటీసులు కూడా విడుద‌ల‌య్యాయి.

ఇదిలా ఉంటే.. ర‌విప్ర‌కాశ్ ఆచూకీ ఎక్క‌డ‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కే స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. అమ‌రావ‌తిలో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించిన ప‌క్కా ఆధారాలు ల‌భించ‌క‌పోవ‌టంతో.. ఆయ‌న్ను అదుపులోకి తీసుకునే విష‌యంలో సైబ‌రాబాద్ పోలీసులు కిందామీదా పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ర‌విప్ర‌కాశ్ తాజాగా ఒక పిటిష‌న్ తో తెర మీద‌కు వ‌చ్చారు. త‌న మీద పెట్టిన కేసుల‌న్ని దురుద్దేశంతోనే పెట్టార‌ని.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ జారీ చేశారు. బంజారాహిల్స్ తో పాటు.. సైబ‌ర్ క్రైమ్స్ పోలీస్ స్టేష‌న్ల‌లో త‌న‌పై న‌మోదైన మూడు కేసుల్లో ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనికి సంబంధించిన పిటిష‌న్ ను హైద‌రాబాద్ బెంచ్ లో దాఖ‌లు చేశారు. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్ మార్పున‌కు సంబంధించిన వివాదంలో దురుద్దేశంతోనే త‌న‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. త‌న‌పై ఒత్తిడి పెంచేందుకు వీలుగా కేసులు న‌మోదు చేయిస్తున్నార‌న్నారు. కొత్త‌గా నియ‌మితులైన డైరెక్ట‌ర్లు చ‌ట్ట‌ప్ర‌కారం కొన‌సాగ‌టానికి వీల్లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న‌ను అరెస్ట్ చేసి తీరాల‌న్న ల‌క్ష్యంతోనే ఈ కేసుల్ని న‌మోదు చేసిన‌ట్లుగా ఆయ‌న త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు.

త‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ కు తోడుగా.. ఏ ఏ సంద‌ర్భాల్లో బెయిల్ ఇవ్వొచ్చ‌న్న అంశాల‌పై గ‌తంలో సుప్రీంకోర్టు వెలువ‌రించిన తీప్పుల‌ను పిటిష‌న్ లో పేర్కొంటూ ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌విప్ర‌కాశ్ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీకరించింది హైకోర్టు. కోర్టు విధించే ష‌ర‌తుల‌కు తాను లోబ‌డి ఉంటాన‌ని.. పోలీసుల ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌కారం అందిస్తాన‌ని అందులో పేర్కొన్నారు. ఈ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై రేపు (మే22) విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. బ‌య‌ట‌కు రాని ర‌విప్ర‌కాశ్ ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.