Begin typing your search above and press return to search.

ఇన్ని మాటలు ఎందుకు? పరార్ కావడం ఏం నైతికత?

By:  Tupaki Desk   |   22 May 2019 2:30 PM GMT
ఇన్ని మాటలు ఎందుకు? పరార్ కావడం ఏం నైతికత?
X
మాటెత్తితే విలువల గురించినే మాట్లాడుతూ ఉన్నారు టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్. ఆ మధ్య టీవీ నైన్ తెర మీద కనిపించినప్పుడు కూడా ఈయన విలువల గురించినే మాట్లాడారు. ఇతర మీడియా వర్గాల వారు విలువలను పాటించాలని ఈయన హితవు పలికారు.

ఆ తర్వాతే పరార్ అయ్యాడీయన. మళ్లీ అడ్రస్ లేదు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసి మళ్లీ విలువల గురించి ప్రబోధించారు రవి ప్రకాష్. అయినా టీవీ నైన్ మార్కు జర్నలిజాన్ని దశాబ్దాలుగా చేసిన ప్రేక్షకులు రవి ప్రకాష్ ఇప్పుడు 'విలువలు' గురించి మాట్లాడుతూ ఉండటాన్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు కూడా రవి ప్రకాష్ తన బాధంతా ఇతర మీడియా పక్షాల గురించినే! ఇతర మీడియా పక్షాలు తన గురించి కథనాలు ఇస్తున్నాయని ఆయన ఫీల్ అయిపోయారు. మరి పదిహేనేళ్ల పాటు టీవీ నైన్ సీఈవోగా ఉన్నంత సేపూ రవి ప్రకాష్ కు తాము చేసిన పనేంటే ఏమైనా గుర్తుందా?

ఎంతమంది గురించి ఎలాంటి కథనాలు ఇచ్చి ఉంటారు? ఆ కథనాలతో వాళ్లు ఎంత ఫీల్ అయ్యి ఉంటారు? ఆధారాలు లేకుండా కథనాలు ఇస్తే వారి కుటుంబాలు పడే క్షోభ ఏమిటి? అనే అంశాల గురించి రవి ప్రకాష్ కు ఇన్నేళ్లూ అవగాహన లేదా? తన దాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదా?

ఇప్పుడు రవి ప్రకాష్ ఇతర మీడియాల వర్గాల గురించి వాపోతూ ఉండటమే పెద్ద విడ్డూరం. ఇన్నేళ్లూ నువ్వు చేసిన పనినే ఇప్పుడు అందరూ నీ గురించి చేస్తూ ఉండవచ్చు. ఆ పనికి నువ్వే ఆధ్యుడివి అని, టీవీ నైన్ ను ప్రారంభించింది నువ్వే అని చెప్పుకుంటున్నావు కదా.. అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ సంగతలా ఉంటే.. ఇంతలా విలువల గురించి మాట్లాడిన రవి ప్రకాష్ ఇలా పరారీలో ఉండటం ఎంత వరకూ నైతిక అనిపించుకుంటుందో తనే ఆలోచించుకోవాలి. ఆయనకు పోలీసుల మీద నమ్మకం పోయిందట! ఒక జర్నలిస్టు మాట్లాడాల్సిన మాటేనా ఇది?

పోలీసులు అంతా మైంహోమ్ రామేశ్వరరావు ఆదేశాల మేరకు పని చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి కోర్టులు ఉన్నాయి కదా.. ఏ తప్పూ చేయనప్పుడు కోర్టులను ఆశ్రయించి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. అది జరగాలంటే ముందుగా పోలీసులకు లొంగిపోవాలి. అది మాత్రం జరగదన్నట్టుగా రవి ప్రకాష్ మాట్లాడుతున్నాడు. అంతే కాదు..తను ఎక్కడ ఉన్న విషయాన్ని రవి ప్రకాష్ మాట మాత్రమైనా చెప్పకపోవడం గమనార్హం.