Begin typing your search above and press return to search.

ఫోర్జ‌రీ నేరాన్ని ఒప్పేసుకున్న ర‌విప్ర‌కాశ్‌?

By:  Tupaki Desk   |   8 Jun 2019 6:04 AM GMT
ఫోర్జ‌రీ నేరాన్ని ఒప్పేసుకున్న ర‌విప్ర‌కాశ్‌?
X
ఫోర్జ‌రీ.. మోసం.. డేటా చౌర్యంతో పాటు.. లోగో అక్ర‌మ అమ్మ‌కానికి సంబంధించి ప‌లు కేసులు నమోదైన టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ గ‌డిచిన నాలుగు రోజులుగా పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల పాటు సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రైన ఆయ‌న‌.. శుక్ర‌వారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ప‌లు నేరారోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో ప‌లు ప్ర‌శ్న‌లు పోలీసులు సంధించినా.. దేనికి నేరుగా.. సూటిగా స‌మాధానం ఇచ్చింది లేద‌ని చెబుతున్నారు. త‌న స‌మాధానాల‌తో పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన ర‌విప్ర‌కాశ్‌.. కొన్ని సంద‌ర్భాల్లో పోలీసుల‌తో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు అవాక్కు అవుతున్నారు.

సైబ‌రాబాద్ పోలీసుల విచార‌ణ జ‌రిపిన మూడు రోజుల్లో ఒక్క‌టంటే.. ఒక్క ప్ర‌శ్న‌కు మాత్ర‌మే నేరుగా స‌మాధానాన్ని ర‌విప్ర‌కాశ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఫోర్జ‌రీ కేసులో సంత‌కాన్ని తానే ఫోర్జ‌రీ చేసిన‌ట్లుగా ర‌విప్ర‌కాశ్ అంగీక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. ఫోర్జ‌రీ కేసులో సంత‌కాన్ని ఎలా ఫోర్జ‌రీ చేసిన విష‌యాన్ని చెప్పిన ఆయ‌న‌.. ఎందుకు ఫోర్జ‌రీ చేశార‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా దాటేసిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌దుప‌రి స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. ర‌విప్ర‌కాశ్ విచార‌ణ మొత్తాన్ని రికార్డు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఫోర్జ‌రీ కేసులో ర‌విప్ర‌కాశ్ చేతిరాత‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి కీల‌క ప‌రిణామాలు శ‌నివారం చోటు చేసుకోనున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రోజు ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ కు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.