Begin typing your search above and press return to search.

నైతికత మాటేంటి? రవి ప్రకాష్ కొత్త చానల్ తో వచ్చినా మచ్చే!

By:  Tupaki Desk   |   13 May 2019 4:43 PM GMT
నైతికత మాటేంటి? రవి ప్రకాష్ కొత్త చానల్ తో వచ్చినా మచ్చే!
X
టీవీ నైన్ సీఈవో హోదా నుంచి యాజమాన్యం చేత తొలగింపబడిన రవి ప్రకాష్ తనపై నమోదు అయిన కేసుల విచారణ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. వరసగా మూడో రోజు కూడా ఆయన తనపై నమోదైన కేసుల విచారణకు హాజరు కాలేదు. సోమవారం రోజున ఆయన విచారణకు హాజరు కాకపోతే ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉందని ముందుగా వార్తలు వచ్చాయి.

బహుశా అది జరుగుతుందో లేదో కానీ… రవి ప్రకాష్ పరారీలో ఉన్నట్టే. ఆయన ఎక్కడో అజ్ఞాతంలో దాక్కొన్నాడని వార్తలు వస్తున్నాయి. బహుశా అది విజయవాడ అనే మాట కూడా వినిపిస్తూ ఉంది!

రవి ప్రకాష్ విజయవాడలో ఉంటాడనేదందుకు చాలా లాజిక్కులే ఉన్నాయి. అవేమిటో ఎవరికీ వివరించనక్కర్లేదు. అందరికీ అన్నీ తెలిసినవే.

ఈ కేసులో రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్ రావొచ్చు అని, అది వచ్చాకా ఆయన అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడని అంటున్నారు. ఆ తెలివి తేటలు అయితే బాగున్నాయి. మరి ఇలాంటి తెలివి తేటలను ఉపయోగించే వారి గురించి రవి ప్రకాష్ ఎలాంటి వార్తలను రాసి ఉంటారు? అలాంటి వారి గురించి ఆయన సీఈవోగా ఉండిన చానల్ లో ఎలాంటి కథనాలు ఇచ్చి ఉంటారో అందరికీ తెలిసిందే.

మరి ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారు. తనను ఎవరూ ఏం చేయలేరని చెప్పుకొచ్చి - తనను ఎవరూ సీఈవో పదవి నుంచి తొలగించలేరని ప్రకటించి - తనను ఎవరూ అరెస్టు చేయలేరని చెప్పిన రవి ప్రకాష్ ఇప్పుడు వాటిలో కొన్ని జరిగి మిగతావి జరిగేలా ఉండటంతో పరారీలో ఉన్నారు!

మరి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిన తర్వాత రవి ప్రకాష్ మరో చానల్ తోనే వస్తాడని అనుకుందాం. మరో సంస్థను డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాడనే అనుకుందాం. అయితే ఈ మచ్చ మాటేంటి? రేపు ఈయన జర్నలిస్టుగా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు సదరు వ్యక్తులు ఈయన చరిత్రను ప్రస్తావిస్తే? రేపు ఈయన జర్నలిస్టు కమ్ సీఈవోగా ఏదైనా చానల్ కు హెడ్ గా వ్యవహరిస్తే.. ఆ చానల్ నైతికతను అవతల వాళ్లు ప్రశ్నిస్తే? మీ కథేంటి? అని ఎదురు ప్రశ్న వేస్తే? అప్పుడు ఏమని సమాధానం ఇస్తారు?