Begin typing your search above and press return to search.

యుద్ధ‌మేంటి? జ‌ర్న‌లిజం ఏంటి ర‌విప్ర‌కాషా?

By:  Tupaki Desk   |   5 Jun 2019 4:43 AM GMT
యుద్ధ‌మేంటి?  జ‌ర్న‌లిజం ఏంటి ర‌విప్ర‌కాషా?
X
వివాదాలు ఎప్పుడూ వెతుక్కుంటూ రావు. మ‌నం చేసే ఏదో ఒక త‌ప్పు.. మ‌న‌లో ఉండే స్వార్థం.. మోహం.. ఇలాంటి ఏదో ఒక గుణం కార‌ణంగానే వివాదాలు మీద‌కు వ‌స్తుంటాయి. చాలా అరుదుగా మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితుల్లో వ‌స్తుంటాయ‌ని చెప్పాలి. టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హారాన్ని చూస్తే.. చేసుకున్నోడికి చేసుకున్నంత మ‌హ‌దేవా అన్న సామెత గుర్తుకు రాక మాన‌దు.

టీవీ9కు అన్యాయం జ‌రుగుతుంద‌ని.. ప‌ర‌మ ప‌విత్ర‌మైన టీవీ9ను మోస‌పూరితంగా సొంతం చేసుకోవాల‌న్న దుర్మార్గ‌మైన ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ఉంటే.. నిత్యం స‌మ‌స్య‌ల మీద పోరాడే టీవీ9.. త‌న‌కు సంబంధించిన అంశం మీద ఎందుకు పోరాడ‌లేదు? ఇదిగో.. ఇలా తప్పుడు ప‌ద్ద‌తుల్లో నా నుంచి నా చాన‌ల్ ను లాగేసుకుంటున్నారంటూ ఒక్క రోజు కూడా బ‌య‌ట‌కు రాని ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్న‌మైన వాద‌న‌ల్ని వినిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

తన మాన‌స‌పుత్రిక‌( ర‌విప్ర‌కాశ్ చెప్పుకునే దాని ప్ర‌కారం మాత్ర‌మే సుమా) టీవీ9ను త‌న నుంచి లాగేసుకునేందుకు దుష్ట‌.. దుర్మార్గ మాఫియా క‌ట్ట‌క‌ట్టుకొని త‌న మీద యుద్ధం చేసిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించ‌టం చూస్తే.. ర‌విప్ర‌కాశ్ ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో ఇట్టే తెలియ‌క మాన‌దు. అంత నీతిగా.. నిజాయితీగా.. ముక్కుసూటిగా ఉంటే.. నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా.. హైకోర్టు.. సుప్రీంకోర్టుల చుట్టూ తిరగాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. అవేమీ చేయ‌ని ఆయ‌న‌.. త‌న మీద కంప్లైంట్లు న‌మోదై.. కేసులు క‌ట్టిన త‌ర్వాత నీతులు వ‌ల్లించ‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి.

పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్‌.. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే. దాదాపు 27 రోజుల ప‌రారీ త‌ర్వాత పోలీసుల ఎదుట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. టీవీ9ను ఇద్ద‌రు ధ‌నికులు అక్ర‌మంగా కొనుక్కున్నార‌ని.. త‌న‌పై దొంగ కేసులు పెట్టార‌ని ఆరోపించారు. రూల్స్ కు భిన్నంగా బోర్డు మీటింగ్ పెట్టుకొని త‌న‌ను అక్ర‌మంగా టీవీ9 నుంచి బ‌య‌ట‌కు పంపిన‌ట్లుగా విమ‌ర్శించారు.

పోలీసుల ప్ర‌శ్న‌ల‌కు తాను స‌మాధానం చెప్పాన‌ని.. పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తున్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. మాఫియాకు.. మీడియాకు జ‌రుగుతున్న ధ‌ర్మ‌యుద్ధంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ వార్ లో జ‌ర్న‌లిజం గెలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ మాట‌లు విన్నంత‌నే విస్మ‌యానికి గురి కావ‌టం ఖాయం. టీవీ9 మొత్తం వ్య‌వ‌హారం న‌లుగురైదుగురి మ‌ధ్య జ‌రిగిన ప్రైవేటు వ్య‌వ‌హారం. ఆ మాట‌కు వ‌స్తే 90శాతం వాటా ఉన్న వ్య‌క్తి త‌న‌కు న‌చ్చినోళ్లు అమ్మితే.. ఎనిమిది శాతం వాటా ఉన్న త‌న ఇష్టాల‌కు త‌గ్గ‌ట్లు మిగిలిన అంద‌రూ న‌డ‌వాల‌ని భావించ‌టం ఏమిటి? పోలీసుల విచార‌ణ అనంత‌రం ర‌విప్ర‌కాశ్ మాట్లాడిన మాట‌లు వింటే ఆయ‌న ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో అర్థం కాక మాన‌దు. ఇలాంటివేళ‌.. మీడియా.. మాఫియా.. యుద్ధం.. జ‌ర్న‌లిజ లాంటి మాట‌లు చెప్ప‌టం ఏమిటి ర‌విప్ర‌కాషా అన్న క్వ‌శ్చ‌న్ మ‌దిలోకి రావ‌టం ఖాయం. యుద్ధం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద కాకుండా.. మీ ఆస్తిత్వం మీద‌నా.. మీ ఇగో మీద‌న అయిన‌ప్పుడు అందులోకి ప్ర‌జ‌ల్ని ఎందుకు లాగ‌టం? ప్రైవేటు వ్య‌వ‌హారాన్ని ప్ర‌జాస‌మ‌స్య‌గా మార్చే చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ర‌విప్ర‌కాశ్ మాట‌ల‌కు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.