Begin typing your search above and press return to search.

తప్పును ఎత్తి చూపిస్తే 100 కోట్ల పరువు నష్టం దావానా?

By:  Tupaki Desk   |   11 Oct 2019 7:42 AM GMT
తప్పును ఎత్తి చూపిస్తే 100 కోట్ల పరువు నష్టం దావానా?
X
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తన లీలలతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇంతకాలం తాను చేసిన తప్పుల్ని ఎవరూ ప్రశ్నించని వైనానికి భిన్నంగా ఇప్పుడుచోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

టీవీ9 లోగోను లక్ష కంటే తక్కువ మొత్తానికి అప్పనంగా తన మీడియా సంస్థకు ధారాదత్తం చేసిన ఉదంతంలో తప్పు కనిపించని రవిప్రకాశ్ కు.. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపించిన వారిపై పరువునష్టం దావా వేయబోతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లింపుతో సహా.. పలు తప్పుడు పనులు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పైన పలు కేసులు నమోదు కావటం తెలిసిందే.

ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉంటున్న ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయబోతున్నారు అంటూ వార్తలు రావడం ఆసక్తకిరంగా మారింది. ఈ విషయాన్ని రవిప్రకాశ్ మేనేజర్ వెల్లడించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రవిప్రకాశ్ మేనేజర్ పేరు మీద విడుదలైన వాట్సాప్ మెసేజ్ లో.. ఇంతకీ ఆ మేనేజర్ ఎవరన్న విషయాన్ని పేర్కొనలేదు. అంతేనా.. ఎక్కడైనా.. ఏదైనా విషయాన్ని పత్రికా ప్రకటనగా విడుదల చేసే సమయంలో కనీసం లెటర్ హెడ్ మీద పంపటం ఉంటుంది.

సుదీర్ఘకాలంలో మీడియాలో పని చేసిన రవిప్రకాశ్.. మరి తన మేనేజర్ తో విడుదల చేసిన పరువునష్టం దావా వివరాలకు సంబంధించిన నోట్ మీద ఎలాంటి సీల్ లేకపోవటం గమనార్హం. నిత్యం విలువల గురించి అదే పనిగా మాట్లాడే రవిప్రకాశ్.. పరువునష్టం దావా వేస్తానన్న పత్రికా ప్రకటన అయినా సక్రమంగా పంపకపోవటం ఏమిటి? ఇంతకీ రవిప్రకాశ్ తరఫున మీడియాకు వివరాలు పంపిన మేనేజర్ పేరేమిటి? అన్న వివరాల్ని సదరు ప్రకటనలో ఎందుకు లేనట్లు? ఇంతకీ రవిప్రకాశ్ మేనేజర్ ఎవరంటారు?