Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో మ‌ళ్లీ బాబును బుక్ చేసే చ‌ర్చ

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:31 PM GMT
పార్ల‌మెంటులో మ‌ళ్లీ బాబును బుక్ చేసే చ‌ర్చ
X
పార్ల‌మెంటు వేదిక‌గా వ‌రుస‌గా రెండో రోజు సైతం ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇర‌కాటంలో ప‌డే చ‌ర్చ జ‌రిగింది. రెండో రోజు కూడా ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటుపై తెలంగాణ‌లో అధికార ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీ ప‌ట్టుబ‌ట్టింది. దీంతో ఏపీ ముఖ్య‌మంత్రిని ఇర‌కాటంలో పెట్టేలా...కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌త్యేక హైకోర్టు ఏర్పాటు కోసం టీఆర్ ఎస్ గ‌ళం విప్పుతున్న నేప‌థ్యంలో....ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌ సభలో ప్రకటన చేశారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఏపీలో హైకోర్టు కోసం భవనం వెతుకుతున్నామని..కొత్త భవనం దొరకగానే హైకోర్టు ఏర్పాటు చేస్తమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టును విభజించాల్సి ఉందని తెలిపారు. జడ్జిల కేటాయింపు అంశాన్ని హైకోర్టు కొలిజీయం పరిశీలిస్తుందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. `ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుంది. ఏపీకి నూతన హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిధులిచ్చాం. హైకోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు స్థలం కేటాయించాల్సి ఉంది` అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. జడ్జీలతో సంప్రదించి హైకోర్టు స్థలంపై ప్రతిపాదనలు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో హైకోర్టు విభజన సమస్య పరిష్కరిస్తమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉత్పన్నమైన సమస్యలపై తెలంగాణ - ఆంధప్రదేశ్ రాష్ర్టాల సీఎంలతో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ తెలిపారు. ఆ చర్చల్లో తాను కూడా పాల్గోనున్నట్లు ఇవాళ లోక్‌ సభలో మంత్రి రాజ్‌ నాథ్ స్పష్టం చేశారు. జడ్జిల నియామకం - పదోన్నతిపై హామీ ఇవ్వాలని టీఆర్‌ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోక్‌ సభలో డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. హైకోర్టు - సుప్రీంకోర్టుకు చెందిన కొలిజియం న్యాయమూర్తుల నియామకాన్ని నిర్ణయిస్తుందని, ఈ అంశంపై తాను ఏమీ హామీ ఇవ్వలేనని మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు.

కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తీసుకెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును మాత్రం ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్ర‌శ్నించారు. హైకోర్టు విభజనపై కావల్సింది హామీలు కాదని కార్యాచ‌ర‌ణ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.