Begin typing your search above and press return to search.

బాబు అంత‌రంగాన్ని బీజేపీ బ‌య‌ట‌పెట్టేసిందే!

By:  Tupaki Desk   |   19 March 2018 8:48 AM GMT
బాబు అంత‌రంగాన్ని బీజేపీ బ‌య‌ట‌పెట్టేసిందే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఇప్పుడు కొత్త‌గా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ గొంతెత్తుతోంది. మొన్న‌టిదాకా ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదు - కేంద్రంలోని మోదీ స‌ర్కారు రాష్ట్రానికి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పింది... ఈ ప్యాకేజీ ముందు హోదా దిగ‌దుడుపేనంటూ స్వయంగా టీడీపీ - ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడే చెప్పుకొచ్చారు. ఈ దిశ‌గా చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌ను టీడీపీ అనుకూల మీడియా లెక్క‌లేనన్ని క‌థ‌నాల్లో రాసేసింది కూడా. ఇదే క‌థ‌నాల‌ను - నాడు చంద్రబాబు చేసిన ప్ర‌సంగాల‌ను ప‌ట్టుకుని బీజేపీకి చెందిన ఏపీ నేత‌లు బాబు వైఖ‌రిని బ‌హిరంగంగానే తూర్పార‌బ‌ట్టారు. అస‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి మాట మార్చింది ఎవ‌ర‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన బీజేపీ నేత‌లు... మాట మార్చింది టీడీపీనే త‌ప్పించి తాము కాద‌ని కూడా వారు చాలా స్ప‌ష్టంగానే చెబుతున్నారు.

ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగిస్తున్న విప‌క్ష వైసీపీ ఇప్పుడూ అదే పంథాను కొన‌సాగిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తే... ఏ మేర లాభం చేకూరుతుంద‌న్న విష‌యాన్ని జ‌నానికి తెలిపిందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా యువ‌భేరీల పేరిట ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించారు కూడా. ఈ స‌ద‌స్సుల‌కు హోరెత్తిన యువ‌త‌... ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని నిన‌దించింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌సరం లేద‌న్న టీడీపీ వాద‌న‌ను యువ‌త బ‌హాటంగానే విమ‌ర్శించింది. అస‌లు ప్ర‌త్యేక హోదా వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై టీడీపీకి గానీ - ఆ పార్టీ అధినేత హోదాలో ఉన్న చంద్ర‌బాబుకు గానీ స‌మ‌గ్ర అవ‌గాహ‌న లేద‌ని కూడా యువ‌త ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మిడిమిడి జ్ఞానంతోనే టీడీపీ స‌ర్కారు... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని, ప్యాకేజీతో మ‌రింత ప్ర‌యోజ‌నం క‌లుగ‌నుంద‌ని కూడా ప్ర‌చారం చేసింద‌ని విమ‌ర్శించింది.

ఇక మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌ లో ఏపీ ప్ర‌స్తావ‌న లేని విష‌యంపై భ‌గ్గుమ‌న్న వైసీపీ... బ‌డ్జెట్ స‌మావేశాల్లోగా ఏపీకి న్యాయం చేయ‌క‌పోతే త‌మ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో బీజేపీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌ల‌తో చంద్ర‌బాబులో నిజంగానే ఆందోళన తారాస్థాయికి చేరిపోయింద‌న్న వాద‌న వినిపించింది. ఆ వెంట‌నే రంగంలోకి దిగిపోయిన చంద్ర‌బాబు... త‌న నిజ‌స్వ‌రూపం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతో మోదీ కేబినెట్ లోని ఇద్ద‌రు టీడీపీ ఎంపీల‌తో రాజీనామా చేయించారు. అయితే ఆ స‌మ‌యంలో కూడా ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగిస్తున్న పోరును వైసీపీ మ‌రింత ఉధృతం చేసిన ద‌రిమిలా... జ‌నంలో ప‌లుచ‌బ‌డిపోతామ‌న్న భ‌యంతో చంద్ర‌బాబు ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఆ త‌ర్వాత వేగంగా జ‌రిగిన ప‌రిణామాల్లో భాగంగా వైసీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎక్క‌డ త‌మ పార్టీ ఇమేజీ దెబ్బ‌తింటుందేమోన‌న్న భ‌యంతో తామే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న పోరులో వైసీపీ స్పీడు పెరుగుతున్న కొద్దీ చంద్ర‌బాబు వ‌రుస‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ఇట్టే అర్థం కాక‌మాన‌దు. ఈ విష‌యాల‌న్నీ కూడా ప్ర‌జ‌లు గమ‌నిస్తూనే ఉన్నారు కూడా. వైసీపీ పోరాటం ఏమాత్రం ఉధృతం కాకున్నా... చంద్రబాబు నుంచి ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు వెలువ‌డేవి కావ‌న్న భావ‌న కూడా ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది. అంటే వైసీపీకి భ‌య‌ప‌డే చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్న మాట‌. ఈ మాట ముమ్మాటికీ నిజ‌మేన‌ని బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేత‌లు కూడా చెబుతున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగానే మోదీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నేటి ఉద‌యం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ప్ర‌సాద్ టీడీపీ - ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నిజ నైజాన్ని బ‌య‌ట‌పెట్టారు. అస‌లు ప్ర‌సాద్ ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... *మాతో చంద్ర‌బాబుకు ఎలాంటి స‌మ‌స్యా లేదు. చంద్ర‌బాబుకు అస‌లు స‌మ‌స్య వైసీపీనే. వైసీపీకి భ‌య‌ప‌డి టీడీపీ ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌న్న విషయంలో మేం ఇప్ప‌టికీ క్లియ‌ర్‌గానే ఉన్నాం. ఈ విష‌యంలో మ‌మ్మ‌ల్ని ఏ ఒక్క‌రూ అనుమానించాల్సిన అవ‌స‌రం లేదు. హోదా సాధ్యం కాని నేప‌థ్యంలోనే మేము ప్యాకేజీని ప్ర‌తిపాదించాం* అని ప్ర‌సాద్ చాలా విస్ప‌ష్టంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా బాబు వైఖ‌రిపై ఏపీ ప్ర‌జ‌లు, వైసీపీ నేత‌లు ఎలాంటి భావ‌న‌తో ఉన్నారో, ఇప్పుడు టీడీపీ మొన్న‌టిదాకా కొన‌సాగిన ఎన్డీఏలోని కీల‌క భాగ‌స్వామ‌య్య ప‌క్ష‌మైన బీజేపీ అదే భావ‌న‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డం విశేషం.