Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దుతో వ్య‌భిచారం త‌గ్గింది: కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   8 Nov 2017 1:43 PM GMT
నోట్ల ర‌ద్దుతో వ్య‌భిచారం త‌గ్గింది: కేంద్ర‌మంత్రి
X
నేటితో పెద్ద‌నోట్ల ర‌ద్దుకు ఏడాది పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. అధికార బీజేపీ ఈ రోజును న‌ల్ల‌ధ‌న వ్య‌తిరేక దినోత్స‌వంగా జ‌రుపుకుంటుంటే - ప్ర‌తిప‌క్షాలు బ్లాక్ డే గా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రూ.1000 - రూ.500 నోట్ల ర‌ద్దు వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగాయ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. నోట్ల ర‌ద్దు ఓ అనాలోచిత నిర్ణ‌య‌మ‌ని - దాని వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌యింద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. తాజాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ నోట్ల ర‌ద్దుపై స్పందించారు. రూ.500 - రూ.1000 నోట్ల రద్దుతో ప్రాస్టిట్యూషన్ తగ్గిందని ఆయ‌న అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యభిచారానికీ అడ్డుకట్ట పడిందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే అనేక ప్ర‌యోజ‌నాల‌ను ర‌విశంక‌ర్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

గ‌త ఏడాది పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం క‌శ్మీర్ లో రాళ్ల దాడులు - ఉగ్రవాదం - నక్సలిజాలతో పాటు వ్యభిచారం కూడా తగ్గింద‌ని ర‌విశంక‌ర్ చెప్పారు.

బిహార్‌ - ప‌శ్చిమ బెంగాల్‌ - అస్సాం తో స‌హా దేశంలోని ఇత‌ర ప్రాంతాల నుంచి వ్యభిచారిణుల్ని కొన్ని ముఠాలు ఢిల్లీకి తీసుకువచ్చేవ‌ని - దాని కోసం రూ.500 - రూ.1000 నోట్లను వినియోగించేవార‌ని చెప్పారు. నోట్ల రద్దు అనంత‌రం దేశంలో వ్యభిచారం తగ్గిందని హోంశాఖ గణాంకాలూ చెబుతున్నాయన్నారు. అంతే కాకుండా నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో సుపారీ హ‌త్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని తెలిపారు. భార‌త్ ను అవినీతి ర‌హిత దేశంగా తీర్చిదిద్దేందుకే బీజేపీ నోట్ల‌ర‌ద్దును చేప‌ట్టింద‌న్నారు.

నోట్ల ర‌ద్దు తర్వాత డిజిట‌ల్ లావాదేవీల ద్వారా ప్ర‌భుత్వ ప‌థ‌కాల సొమ్ము నేరుగా పేద‌ల ఖాతాల‌లో జ‌మ అవుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. నోట్ల ర‌ద్దు అనంత‌రం డిజిట‌ల్ లావాదేవీలు పెరిగాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌న్నారు. అయితే, నోట్లర‌ద్దు ప్రధాన ఉద్దేశ‌మైన న‌ల్ల‌ధ‌నం వెలికితీత గురించి ఆయన మాట్లాడ‌లేదు. బ‌డాబాబులు త‌మ బ్లాక్ మ‌నీని వైట్ మ‌నీగా మార్చ‌డం గురించి ఆయ‌న నోరు విప్ప‌లేదు. హ‌ఠాత్తుగా పెద్ద నోట్ల ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల చిరువ్యాపారులు న‌డిరోడ్డున ప‌డ‌డం గురించి, చిల్ల‌ర కొర‌త‌తో సామాన్యులు ప‌డ్డ‌ క‌ష్టాల గురించి ర‌విశంక‌ర్ ప్ర‌స్తావించ‌లేదు. గంట‌ల త‌ర‌బ‌డి బారులు తీరిన క్యూలైన్ల‌లో నిల‌బ‌డి అశువులు బాసిన అమాయ‌కులు ఆయ‌న‌కు గుర్తుకు రాలేదు. నోట్ల ర‌ద్దులో ఉన్న లోపాల గురించి ఆయ‌న పెద‌వి విప్ప‌లేదు.