Begin typing your search above and press return to search.

వీరవిధేయుడ్నిబీజేపీ పెద్దలు ఊరుకోరంట

By:  Tupaki Desk   |   17 Feb 2016 12:07 PM GMT
వీరవిధేయుడ్నిబీజేపీ పెద్దలు ఊరుకోరంట
X
‘బజార్లో నా తల్లిని ఎవరైనా తిడితే నేను ఊరుకోను. నా దేశాన్ని ఎవరైనా తిట్టినా.. వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఒప్పుకుంటాను. అప్పుడు కానీ నా చేతిలో తుపాకీ కానీ ఉండి ఉంటే కాల్చి పారేసేవాడ్ని’’ అంటూ రోడ్డు మీద తాను చేసిన హడావుడిని ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ సమర్థించుకోవటం తెలిసిందే. ఢిల్లీ జేఎన్ యూలో చోటు చేసుకున్న ఘటనలు.. ఉగ్రవాది అఫ్జల్ గురు వర్థంతిని వర్సిటీ క్యాంపస్ లో చోటు చేసుకోవటం.. దీనిపై జరిగిన అరెస్ట్ లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని పాటియాలా కోర్టు వద్ద రచ్చ రచ్చ చేయటం.. ఈ హడావుడిలో ఒకడు.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటాన్ని చూసి తట్టుకోలేక రోడ్డు మీదే కొట్టేసిన ఓంప్రకాశ్ శర్మ గత రెండు రోజుల్లో మీడియాకే కాదు.. దేశ వ్యాప్తంగా సుపరిచితమయ్యాడు.

అతడి చర్యను సమర్థించే వారు ఎంతమందో.. విమర్శించే వారు అంతే మంది ఉన్న పరిస్థితి. కొట్టటమే కాదు.. తన దగ్గర తుపాకీ ఉంటే ఏకంగా కాల్చేసేవాడినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్యే తీరును రాజకీయ పక్షాలు తప్పు పడుతూ విమర్శల దాడికి పూనుకోవటంతో బీజేపీ అధినాయకత్వం ఈ అంశంపై స్పందించాల్సి వచ్చింది.

తమ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ చర్యను తాము సమర్థించటం లేదని.. ఆ పద్ధతి సమర్థనీయం కాదంటూ కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా అది తప్పేనని.. అతగాడి చర్యల్ని తమ ప్రభుత్వం సమర్థించదని తేల్చి చెప్పారు. సమర్థించదని చెబుతున్న బీజేపీ పెద్దలు.. మరి సదరు ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోరా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ మొత్తం వివాదానికి కారణమైన పాకిస్థాన్ జిందాబాద్ నినాదాన్ని వ్యక్తి చేశారా? లేదా? అన్న దానిపై మాత్రం నేతలు.. పోలీసులు మాట్లాడటం లేదు. ఒకవేళ.. అతగాడు అలాంటి నినాదం చేయకున్నా ఎమ్మెల్యే చేయి చేసుకుంటే తీవ్రంగానే పరిగణించాలని చెబుతున్న వారు.. ఒకవేళ సదరు వ్యక్తి పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసి ఉంటే.. మరి దాన్ని ఏమనాలి? అన్న ప్రశ్నకు మాత్రం సూటి సమాధానం రాని పరిస్థితి.