Begin typing your search above and press return to search.

సిమ్ కార్డులు అమ్ముతానంటున్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   18 March 2016 6:46 AM GMT
సిమ్ కార్డులు అమ్ముతానంటున్న కేంద్రమంత్రి
X
ఎంత మాట ఎంత మాట..? ఆయనో కేంద్రమంత్రి. టెలి కమ్యూనికేషన్లకు ఆయనే సూపర్ బాస్. అలాంటి ఆయన బీఎస్ ఎన్ ఎల్ సిమ్ కార్డులు అమ్మటానికి తాను సిద్ధమంటూ ఆసక్తికర వ్యాఖ్య చేస్తున్నారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్ ఎన్ ఎల్ భ్రష్టు పట్టానికి కారణం ఏమిటన్నది.. రాజకీయాలతో సుమారు పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి తెలిసిందే.

దేశంలో టెలికాం సేవలన్నీ గుత్తగా ఉండి.. ప్రైవేటు ఆపరేటర్లకు సరైన నెట్ వర్క్ లేని సమయంలో.. దేశ వ్యాప్తంగా బలంగా ఉన్న బీఎస్ ఎన్ ఎల్ కాలక్రమంలో తన పనితీరు ఎంత దారుణంగా తయారైంది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేటు ఆపరేటర్ల సంక్షేమం కోసం.. వారికి లాభాల పంట పండేందుకు బీఎస్ ఎన్ ఎల్ ను ఎలా బలి చేశారో ప్రతిఒక్కరికి తెలిసిందే. అయినప్పటికీ.. వ్యవస్థలోని లోపాల్ని చక్కదిద్ది.. ప్రైవేటు ఆపరేటర్లకు పోటీగా బీఎస్ ఎన్ ఎల్ చేత దూకుడుగా వ్యాపారం చేయించే దిశగా నిర్ణయాలు తీసుకునే పనిని ఇప్పటివరకూ ఏ అధికారపక్షం చేపట్టలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

వ్యవస్థకు పట్టిన అవినీతి మకిలి తుడిచి వేసేందుకు సరైన ప్రయత్నం చేయాలే తప్పించి.. వీధుల్లోకి వచ్చి బీఎస్ ఎన్ ఎల్ కార్డులు అమ్ముతానని కేంద్రమంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. సమర్థులైన అధికారుల్ని.. నిజాయితీకి నిలువెత్తు రూపాలైన వారిని బీఎస్ ఎన్ ఎల్ పగ్గాలు అప్పగిస్తే.. ప్రైవేటు టెలికం ఆపరేటర్లకు పోటీగా ఎందుకు నిలవదు. అలాంటి చర్యలు చేపట్టకుండా.. కేంద్రమంత్రి బజార్లోకి వచ్చి సిమ్ కార్డులు అమ్మినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే.. ప్రచారానికి పనికొచ్చే మాటల్ని వదిలేసి.. పట్టుదలగా పని చేస్తే బీఎస్ ఎన్ ఎల్ కు పూర్వవైభవం పెద్ద కష్టమేమీ కాదు.