Begin typing your search above and press return to search.

గుండెలకు హత్తుకునేలా రవిశాస్త్రి చివరి మెసేజ్

By:  Tupaki Desk   |   9 Nov 2021 7:35 AM GMT
గుండెలకు హత్తుకునేలా రవిశాస్త్రి చివరి మెసేజ్
X
ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్‌ గా విరాట్ కోహ్లీ, కోచ్‌గా రవిశాస్త్రి శకం నిన్నటి నమీబియా మ్యాచ్‌ తో గతంగా మారింది. ఆదివారం అఫ్గానిస్థాన్‌ ఓటమితో సెమీఫైనల్‌ కు చేరుకోవాలన్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి. అందువల్ల నమీబియాతో జరిగే మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఈ చివరి మ్యాచ్‌‌ తో ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం కూడా ముగిసిపోయింది. కెప్టెన్‌ గా ఈ టోర్నీ తనకు చివరి టీ20 అసైన్‌మెంట్ అని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అదే సమయంలో కోచ్ రవిశాస్త్రి ప్రతి ఫార్మాట్‌ లో తన పదవిని వదులుకుంటున్నాడు.

టీ20 కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్ ఆడిన కోహ్లీ, ఈ మ్యాచ్ అనంతరం పొట్టి పార్మాట్‌లో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర సిబ్బంది పదవీకాలం ముగిసింది. దీంతో టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగాలకు నిలయంగా మారింది. రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాన కోచ్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ (ఆర్. శ్రీధర్)ని కూడా కౌగిలించుకున్నాడు. నిజానికి రవిశాస్త్రితో పాటు వీరిద్దరి పదవీకాలం కూడా టీమ్ ఇండియా తో ముగిసింది. హాట్ హాట్ గా ఉండే డ్రెస్సింగ్ రూమ్‌ లో రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో మాత్రం బరువెక్కింది.

ఇలాంటి బరువైన గుండెలతోనే రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో 70 సెకన్ల పాటు మాట్లాడాడు. ఆటగాళ్లతో రవిశాస్త్రి మాట్లాడుతూ..’ ఐసీసీ టైటిల్ గెలవనందుకు కొంచెం బాధగానే ఉంది. అయితే అదే సమయంలో ఈ టీమ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ జట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటూ గెలుస్తున్నారు. తొలి ఆటగాళ్లను చూసి నేర్చుకోండి అంటూ చెప్పుకొచ్చారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి అందించిన వీడ్కోలు ప్రసంగానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

రవిశాస్త్రి 2017లో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌ గా మారాడు. అతని కోచింగ్‌లో, భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు ప్రయాణించింది. శాస్త్రి హయాంలో ఆస్ట్రేలియన్ గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టులు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.