Begin typing your search above and press return to search.

అదీ అశ్విన్ అంకితభావం.. కానీ, కొవిడ్ పడగ తప్పలేదు

By:  Tupaki Desk   |   21 Jun 2022 11:36 AM GMT
అదీ అశ్విన్ అంకితభావం.. కానీ, కొవిడ్ పడగ తప్పలేదు
X
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉంది. గతేడాది ఇదే రోజుల్లో నిలిచిపోయిన ఓ టెస్టు మ్యాచ్ ను ఆడేందుకు అక్కడకు వెళ్లింది. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కోసం భారత్ లోనే మిగిలిపోయిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండ్రోజుల కిందట ఇంగ్లండ్ బయల్దేరారు. మరోవైపు ఇంగ్లండ్ తో ఈ ఏకైక టెస్టు గతేడాది జరగాల్సిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లో చివరిది. నాడు కొవిడ్ కేసులు వెలుగుచూడడంతో టెస్టును రద్దు చేశారు.

మనదా? వారిదా?వాస్తవానికి నిరుడు టెస్టు సిరీస్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. 2 మ్యాచ్ లు మన జట్టు నెగ్గగా.. 1 మ్యాచ్ ఇంగ్లండ్ గెలిచింది. ఆ ఊపులో చూస్తే టీమిండియా ఐదో టెస్టు కూడా గెలిచేదే. అయితే, కొవిడ్ దెబ్బకొట్టింది. దీంతో సిరీస్ నిలిచిపోయింది. ఇప్పుడా టెస్టును మళ్లీ నిర్వహిస్తున్నా.. నాటి సిరీస్ లో భాగమా? కాదా?అనేది చూడాలి. లేదు.. సిరీస్ అప్పుడే ముగిసింది అంటే.. భారత్ 2-1తో చార్రితక విజయం సాధించినట్లు. లేదంటే వచ్చే నెల 1 నుంచి జరగబోయే చివరి టెస్టును సిరీస్ లో భాగంగా పరిగణిస్తే..అందులో గెలిచిన జట్టుదే సిరీస్ అవుతుంది.

అశ్విన్ కు పాజిటివ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సహా ప్రధాన క్రికెటర్లు అందరూ ఇంగ్లండ్ చేరుకున్నారు. అయితే, మరి రెండు రోజుల్లో బయల్దేరుతాడు అనగా టీమ్ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కొవిడ్ బారినపడ్డాడు.

దీంతో అతడు ఇంగ్లాండ్‌కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు. కాగా, రోహిత్‌ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకొని సాధన మొదలెట్టింది.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ పూర్తయ్యాక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ సోమవారం బయలుదేరి వెళ్లారు.

400 వికెట్లు తీసినా.. ప్రయత్నం ఆపకుండా..టెస్టుల్లో 400 పైగా వికెట్లు తీసిన అశ్విన్ మేటి బౌలర్. అయినా, సాధన ఆపని తీరు అతడిది. ఐపీఎల్ లో రాజస్థాన్‌ తరఫున ఆడాక బయోబబుల్‌ వీడి తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ డివిజన్‌ 1 లీగ్‌ క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. కోలుకున్నాక ప్రొటోకాల్‌ ప్రకారం అక్కడికి బయలుదేరతాడు. ఈ శుక్రవారం నుంచి లీసెస్టర్‌షైర్‌తో ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు అశ్విన్‌ అందుబాటులో ఉండడు. జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ కల్లా అతడు జట్టుతో కలుస్తాడు.

అశ్విన్ నిత్య విద్యార్థి తరచూ తన బౌలింగ్ కు పదును పెట్టుకోవడం, కొత్త తరహాలో ప్రయత్నించడం, అలుపెరగకుండా శ్రమించడం, పరిమిత ఓవర్ల జట్టులో చోటు దొరక్కున్నా.. టెస్టు మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకున్నా బాధపడకపోవడం అశ్విన్ శైలి. పుష్కర కాలంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ అయిన అశ్విన్.. ఇప్పటికీ కొత్త కుర్రాడిలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. వాస్తవానికి ఐపీఎల్ ముగిశాక అతడు తమిళనాడు డివిజన్ 1 లీగ్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ, తనలోని నిత్య విద్యార్థి అశ్విన్ ఖాళీగా కూర్చోనీయలేదు. అదీ.. అశ్విన్ అంటే..