Begin typing your search above and press return to search.

శ్రీలంకతో టెస్ట్: ఇండియా డిక్లేర్ వివాదంపై రవీంద్ర జడేజా క్లారిటీ

By:  Tupaki Desk   |   6 March 2022 5:56 AM GMT
శ్రీలంకతో టెస్ట్: ఇండియా డిక్లేర్ వివాదంపై రవీంద్ర జడేజా క్లారిటీ
X
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 574/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయడం వివాదాస్పదమైంది. దీన్ని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తప్పుపడుతున్నారు. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన రవీంద్ర జడేజా(228 బంతుల్లో 175 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందని అభిప్రాయపడ్డారు. టీమిండియా మేనేజ్ మెంట్ అనాలోచిత నిర్ణయం కారణంగా జడేజా డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ ను టార్గెట్ చేస్తూ విమర్శించారు.

గతంలో సచిన్ టెండూల్కర్ ను ఇలానే డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నారని గుర్తు చేస్తూ ట్రోలింగ్ కు దిగారు. అయితే తన సూచనలతోనే కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడని సెంచరీ హీరో రవీంద్ర జడేజా తాజాగా స్పష్టం చేశారు. రెండోరోజు ఆట అనంతరం మీడియాతో రవీంద్రజడేజా మాట్లాడారు.

ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడాన్ని తప్పుపడుతూ టీం మేనేజ్ మెంట్ పై వస్తున్న విమర్శలపై జడేజా స్పందించాడు. వాస్తవానికి రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయాలని సందేశం పంపాడని.. కానీ తానే అంగీకరించలేదన్నాడు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ పూర్తయ్యాకే డిక్లేర్ ఇస్తామని కుల్దీప్ యాదవ్ తో సందేశం పంపించాడు.

కానీ దాన్ని నేను వ్యతిరేకించాను. చివరి సెషల్ లో ఫీల్డింగ్ చేసి అలిసిపోయిన శ్రీలంక ఆటగాళ్లను బ్యాటింగ్ కు ఆహ్వానిస్తే త్వరగా వికెట్లు తీయవచ్చని భావించానని తెలిపారు.బంతి బాగా టర్న్ అవుతోంది.. అనూహ్య బౌన్స్ అవుతోంది. పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా మారింది. అందుకే డిక్లేర్ చేయమని చెప్పానని అసలు కారణాన్ని జడేజా వివరించాడు.

రెండు రోజులుగా ఫీల్డింగ్ చేసిన శ్రీలంక ఆటగాళ్లకు బ్యాటింగ్ కు ఆహ్వానిద్దామని చెప్పానని జడేజా వివరించారు. రెండు రోజులుగా ఫీల్డింగ్ చేసిన శ్రీలంక ఆటగాళ్లకు బ్యాటింగ్ లో భారీ షాట్లు ఆడటం.. ఎక్కువ సేపు క్రీజులో నిలబడటం అంత సులువు కాదు. కాబట్టి వీలైనంత వేగంగా ఆడి డిక్లేర్ ఇవ్వాలని ప్లాన్ వేసుకున్నాం.. ఈ క్రమంలోనే డిక్లేర్ ఇవ్వాలని నేను చెప్పానని జడేజా స్పష్టం చేశాడు.

శ్రీలంకతో తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు విధించింది. రవీంద్ర జడేజా భారీ శతకంతో ఈ మ్యాచ్ పై భారత్ ఆశలు పెంచింది. రవీచంద్రన్ అశ్విన్ (61), హాఫ్ సెంచరీతో జడేజా కూడా రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేిసంది. భారత్ కన్నా ఆ జట్టు ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది.