Begin typing your search above and press return to search.

త‌నే పరీక్ష రాసి..త‌నే పేప‌ర్ దిద్దుకుంటున్న‌ బాబు

By:  Tupaki Desk   |   28 July 2017 6:22 PM GMT
త‌నే పరీక్ష రాసి..త‌నే పేప‌ర్ దిద్దుకుంటున్న‌ బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా, విస్మ‌యక‌రంగా ఉంద‌ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా అన్నారు. నంద్యాలలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో వారిద్ద‌రూ మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా చంద్రబాబు నంద్యాలకు ఏమీ చేయలేదని అన్నారు. మూడు సార్లు వచ్చినా.. నిలబెట్టుకున్న హామీ గురించి చెప్పుకోలేకపోయార‌ని వ్యాఖ్యానించారు. ``చంద్రబాబు తన సెల్ఫ్ సర్వేను రిలీజ్ చేసుకున్నారు. ఏ విద్యార్థైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తాడు. ఆ పేపర్లను ఇన్విజిలేటర్లు దిద్ది మార్కులు వేస్తారు. కానీ చంద్రబాబు క్వశ్చన్ పేపర్ తానే ప్రిపేర్ చేసుకుని, తానే పరీక్ష రాసి.. తానే దిద్దుకుని.. తనకు తానుగానే మార్కులు వేసుకుంటాడు. నాకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చాయని ప్రచారం చేసుకుంటాడు.ఇదేం చిత్రం!`` అని అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలంతా తనను అంగీకరిస్తున్నారనే ఒక ఇమేజ్ ఇవ్వడానికి ఇలాంటి స్టంట్లు చాలానే చేస్తున్నాడని, ఇకపై చేస్తూనే ఉంటాడని ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు. అయితే తాము చంద్రబాబును ఒకటే అడగదలుచుకున్నామ‌ని తెలిపారు. ``నీ పాలన బ్రహ్మాండంగా ఉందని మీరు నమ్మితే.. మీకు వణుకు ఎందుకు? బెదురు ఎందుకు? ఎందుకు ఇంత కిందా...మీదా? పడుతున్నారు? నంద్యాల లాంటి పట్టణానికి 8 మంది మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను ఎందుకు పంపినట్టు? ఓ పక్క మీరే చెప్తున్నారు... ,నా పాలన బ్రహ్మాండం అని.. మరెందుకు బెదురు? మీ మంత్రులు డబ్బలు సంచులను మోస్తున్నది నిజం కాదా?ఇప్పటికే నంద్యాలలోని కొన్ని ప్రాంతాల్లో ఓటుకి రూ.5వేలు ఇచ్చారని మా దగ్గర సమాచారం వస్తోంది. మళ్లీ రెండో విడతలోనూ ఓటుకు వేలాది రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది..బ్యాగులు మోయడమే పనిగా పెట్టుకున్నారు. ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని ఓ పక్క కొంటున్నావ్... మరోవైపు నే భేష్, నా పాలన భేష్ అని... డబ్బాలు కొడుతున్నావ్...కానీ...- నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనక తప్పదు`` అని ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అన్ని వర్గాల వారినీ ఏపీ సీఎం చంద్ర‌బాబు మోసం చేశారని మండిప‌డ్డారు. కాపు నేత‌ ముద్రగడను ఎందుకు గృహ నిర్బంధం చేశారో చెప్పాల‌ని ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

మ‌రో ఎమ్మెల్యే ఆంజాద్ బాషా మాట్లాడుతూ ఏ వర్గానికీ చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగలేద‌ని అన్నారు. నిరుపేదలను ఆదుకున్న వ్యక్తి దివంగ‌త సీఎం వైఎస్ ఆర్ అని తెలిపారు. నంద్యాల అయ్యలూరు మెట్ట వద్ద పేదలకు వైఎస్ ఆర్ పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. వీరిలో కొంతమంది బేస్ మెంట్లు వేసుకున్నారని, ఇంకొందరు కట్టుకుంటున్నారని తెలిపారు. వాటిని కూల్చేయడానికి పొక్లెయిన్ లు పంపారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేద‌ల ఇండ్ల‌ను కూల్చేందుకు పాల‌కులు ప్రొక్లెయిన్లు పంప‌డం ఏమిట‌ని వైసీపీ ఎమ్మెల్యే సూటిగా ప్ర‌శ్నించారు. పేదలంటే వీరికి అలుసు అని అందుకే వారిపై దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారని మండిప‌డ్డారు. టీడీపీ అక్రమాలపై త‌మ పార్టీ కన్నేసిందని, వీటన్నింటినీ తాము పరిశీలిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆధారాలు కూడా సేకరిస్తున్నామ‌ని పేర్కొంటూ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు మేం ఫిర్యాదు చేస్తున్నామ‌ని, వాటిని ఫాలో అప్ కూడా చూస్తున్నామ‌ని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు.

ప‌లు వర్గాలను వేధించడానికి బయట‌నుంచి కొంతమంది వచ్చి పోలీసుల రూపంలో ఇక్కడ తిష్ట వేశారని సమాచారం వస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంజ‌ద్ బాషా అనుమానం వ్య‌క్తం చేశారు. బెదిరింపులకు దిగితే.. అంతకు మించి ప్రతిస్పందన ఉంటుందని స్ప‌ష్టం చేశారు. దయచేసి ఇలాంటి చర్యలేవైనా ఉంటే ఉపసంహరించుకోవాల‌ని కోరారు. ఎవరు ఉల్లంఘనలకు దిగినా తాము కచ్చితంగా స్పందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వారిపై చర్యకు పట్టుబడతామ‌ని తెలిపారు. కొన్ని వర్గాల వారిని బెదిరించడానికి కొందరు తిష్ట వేశారని, కేసులు బనాయించి హింసించడానికి ప్ర‌యత్నిస్తున్నారని ఇది స‌రికాద‌ని ఎమ్మెల్యే తెలిపారు.