Begin typing your search above and press return to search.

ఆ రికార్డు బాబుకే సొంత‌మంట‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 6:31 AM GMT
ఆ రికార్డు బాబుకే సొంత‌మంట‌
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి గద్దెనెక్కి విస్మరించిన అబద్ధాల కోరుగా చంద్ర‌బాబు చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నేప‌థ్యంలో జ‌రిగిన స‌మావేశంలో ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫి పేర అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు ఈ మేర‌కు విడుద‌ల చేయాల్సి రూ.85 వేల కోట్లలో ఇప్పటి వరకూ కేవలం రూ.7 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసి రైతాంగాన్ని మభ్య పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా 92.8 శాతం ప్రజల్లో పరిపాలనపై వ్యతిరేకత ఉందని చెప్పారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నో ప‌నులు చేస్తున్నాన‌ని చెప్పుకొంటున్నప్ప‌టికీ వాటి వెనుక మ‌త‌ల‌బు వేరేన‌ని ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి తెలిపారు. కేవలం కమీషన్లు - ముడుపులు వచ్చే పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన‌ హామీలను తుంగలోకి తొక్కుతున్నార‌ని విమర్శించారు. ఇరాన్ - ఇరాక్ - సౌదీ అరేబియా - దుబాయ్ వంటి దేశాల్లో అబద్ధాలు చెప్పే వారిని బహిరంగంగా ఉరి తీస్తారన్నారు. అయితే దేశంలో ప్రజాస్వామ్యానికి విలువ ఉంది కాబట్టి కేవలం ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని, ఈ విషయంలో భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ప్రజలకు ఇలాంటి తీర్పు ఇస్తారన్నారు. రాజధాని అమరావతిలోనే ఇప్పటి వరకూ కేవలం రెండు - మూడు భవన సముదాయాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి సాధిస్తాయంటూ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ప్రశ్నించారు. మహిళా సంఘాల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈ దిశగా కనీస చర్యలను తీసుకోలేదన్నారు. వీటితో పాటు అనేక హామీలు ఇచ్చి విస్మరించారన్నారు.

ఇకపోతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ - ఉచిత విద్యుత్ - 108 అంబులెన్స్ - రైతు రుణమాఫీ - విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చిరస్మరణీయుడయ్యారన్నారు. వైఎస్ పాలనకు - చంద్రబాబు పాలనకు ‘నక్కకు నాగ లోకానికి’ ఉన్నంత తేడా ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించారని ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, భవిష్యత్తు వైకాపాదేనంటూ భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి వైకాపా మద్దతు ఇస్తున్న రాష్ట్ర మాజీ ఎన్‌ జిఓ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌ రెడ్డి విజయం కోసం పట్ట‌భ‌ద్రులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు వైకాపా శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైకాపా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు - నాయకులు పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/