Begin typing your search above and press return to search.

కేసీఆర్ సూప‌ర్ సీఎం కానే కాద‌ట‌

By:  Tupaki Desk   |   17 Oct 2016 5:21 PM GMT
కేసీఆర్ సూప‌ర్ సీఎం కానే కాద‌ట‌
X
విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ను నిర్వ‌హించిన స‌ర్వేల్లో సీఎం పనితీరు బాగుంద‌ని తెలంగాణ ప్ర‌జానికం చెప్పుకోవ‌డాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేలలో సూపర్ సీఎం అని ఏ ప్రాతిప‌దిక‌న వచ్చిందని ప్ర‌శ్నించారు. "ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నకిలీ విత్తనాల సరఫరా కావడం వల్ల లక్షలాది ఎకరాలలో పంట నష్టపోయి రైతులు బాధపడుతున్నందుకా సూపర్ సీఎం? టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా సూపర్ సీఎం? ముఖ్యమంత్రి 150 గదులతో ఇల్లు నిర్మించుకుంటూ పేదల డబుల్ బెడ్రూం పథకాన్ని అటకెక్కించినందుకా సూపర్ సీఎం?. మూడు ఎకరాల భూమి పథకానికి 2 లక్షల కుటుంబాలకు అర్హత ఉంది. వీరికి 6 లక్షల ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఒక్క కుటుంబానికి 3ఎకరాలు ఇవ్వనందుకా సూపర్ సీఎం? ఉపాధి హామీ కూలీలకు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వనందుకా సూపర్ సీఎం?" అంటూ నిల‌దీశారు. ప్రజలను మభ్యపెట్టడంలో మాత్రం ముఖ్యమంత్రి సూపర్ సీఎం అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

జిల్లాల పున‌ర్ విభ‌జ‌న‌తో ఎస్సీ - ఎస్టీల‌కు అన్యాయం జ‌రిగింద‌ని రావుల ఆరోపించారు. జిల్లాలను పునర్ విభజన చేసి 31 జిల్లాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని అయితే వీటి ఆధారంగా నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే ఎస్సీ - ఎస్టీలు రిజర్వేషన్లు కోల్పోతారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పరిశీలన ప్ర‌కారం పూర్వం పది జిల్లాలలోని జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఎస్సీ - ఎస్టీల రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పార్టీ సీనియ‌ర్లు నామా నాగేశ్వరరావు - రావుల చంద్రశేఖరరెడ్డి - రమేష్ రాథోడ్‌ ల‌తో త్రీమాన్ కమిటీ అధ్యయనం చేయాల‌ని అధినేత చంద్ర‌బాబు సూచించార‌ని తెలిపారు. ఈ కమిటీ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి - ఎన్నికల సంఘాన్ని కలిసి నివేదికను ఇవ్వనున్నారని వివ‌రించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేకపోవడంతో బలహీన వర్గాల విద్యార్ధులు ఉన్న‌త విద్య‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని రావుల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడో విడత రుణమాఫీని అరకొరగా విడుదల చేయడంతో రెన్యువల్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్య శ్రీ బిల్లలు చెల్లించడంలో అలసత్వం వల్ల పేద ప్రజలకు వైద్యాన్ని నిరాకరిస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. సమస్యలపై ప్రజల మధ్యకు వెళ్లి పోరాటం చేస్తామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/