Begin typing your search above and press return to search.

కేసీఆర్‌....మ‌ళ్లీ ఎందుకు క‌వ్వించావ్?

By:  Tupaki Desk   |   26 Oct 2015 2:07 PM GMT
కేసీఆర్‌....మ‌ళ్లీ ఎందుకు క‌వ్వించావ్?
X
తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు కే చంద్ర‌శేఖ‌ర్‌ రావు - నారా చంద్ర‌బాబునాయుడుల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని భావిస్తున్న స‌మ‌యంలోనే ఇందుకు పూర్తి భిన్న‌మైన నిర్ణ‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులకు సెక్యురిటీని తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంంది. పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.రమణ - శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్రబెల్లి ద‌యాక‌ర రావుకు సెక్యూరిటీ తగ్గిస్తూ తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసింది.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తెలంగాణ తెలుగుదేశం నాయ‌కులు మండిప‌డ్డారు. సెక్యూరిటీని త‌గ్గించ‌డం బాధాకరమని, ఎవరిని సంతోషపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ పొలిట్‌ బ్యూరో స‌భ్యుడు - మాజీ ఎంపీ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం స‌హించ‌డం లేద‌న్నారు. ప్ర‌జా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా టీ టీడీపీ నేతలపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతుందని విమర్శించారు. గతంలో ఎంపీ - ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఎల్‌. రమణకు వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు స‌మాచారం ఇవ్వ‌డం విస్మ‌యం క‌లిగించింద‌ని చెప్పారు. మాజీ ఎంపీ అయిన‌ ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు వన్ ప్లస్‌ త్రీ ఎస్కార్ట్‌ కూడా తీసివేయడం ఏమిట‌ని ప్రశ్నించారు.

గతంలో కూడా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింద‌ని అయితే సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేస్తే తిరిగి పునరుద్దరించారని రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలకు ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదనే భావంతో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. టీ టీడీపీ నేతల సెక్యూరిటీ తొలగింపుపై డీజీపీ, సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదిలాఉండ‌గా...ఎర్రబెల్లి - రేవంత్‌ మధ్య విభేదాలు లేవని, వారిద్దరూ పరిణతి చెందిన నాయకులని పేర్కొన్నారు. వరంగల్‌ పార్లమెంట్ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీకి దిగనున్నట్లు రావుల తెలిపారు.