Begin typing your search above and press return to search.

జగన్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   30 Nov 2018 7:44 AM GMT
జగన్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి సంచలన నిజాలు
X
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో జగన్ తర్వాత అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డినే.. రాయచోటి నుంచి వరుసగా గెలుస్తున్న ఆయన గళం.. ఏపీ అసెంబ్లీలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇంటా, బయటా అసెంబ్లీలో ఇరుకున పెట్టే ఆయన వైసీపీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు. దీనికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. జగన్ అప్పగించిన బాధ్యతకు పూర్తిగా న్యాయం చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు..

వైసీపీ రాయచోటీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వర్ధమాన రాజకీయాలపై స్పందించారు. తాను రాయచోటీ నుంచి వరుసగా మూడు సార్లు గెలవడానికి తన నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లింల ప్రోత్సాహం ఎంతో వుందని పునరుద్ఘాటించారు. ముస్లింలను అభ్యర్థిగా నిలబెడితే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం ఇచ్చారన్నది ప్రోమోలో మ్యూట్ చేశారు. దీనిపై ఆయన ఏం సమాధానం చెప్తారనేది సస్పెన్స్ ను క్రియేట్ చేశారు.

తన రాజకీయ భవిష్యత్తు, స్వార్థం కోసం ఎవ్వరితోనైనా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటాడని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కానీ వైసీపీ మాత్రం తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారితోనే పయనిస్తుందని తెలిపారు. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకునే పరిస్థితి ఏమాత్రం లేదని.. తమ సిద్ధాంతాలకు బీజేపీ పూర్తి వ్యతిరేక పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ కు గాయమై చొక్కా అంతా రక్తంతో తడిసిపోయినా ఆయన రాద్ధాంతం చేయలేదని.. హుందాగా వ్యవహరించారని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. డాక్టర్లు వద్దంటున్న 3వ రోజే ప్రజల వద్దకు ప్రచారానికి వెళతా అన్నారని.. కానీ తామంతా సూచించబట్టే ఆగిపోయారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వివాదంపై తమ నేత హుందాగా ప్రవర్తిస్తే టీడీపీ బురద జల్లిందని విమర్శించారు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కూడా శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కనీసం పోటీ చేయడానికి భయపడే వ్యక్తి తమను విమర్శిస్తాడా అని మండిపడ్డారు. జనసేన పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటినా.. పక్కవారికి సపోర్ట్ చేయడం తప్పితే ఆయన నిలబడితే కదా ఆయన బలం తెలిసేది అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీలో వెన్నుచూపి పారిపోయారని విమర్శించిన పవన్ ఇప్పుడు ఎన్నికలను అనేసరికి ఎందుకు వెన్ను చూపుతున్నాడని ప్రశ్నించారు.. ఓడిపోతాననే భయంతోనే పవన్ పోటీ చేయడం లేదని ఆయన విమర్శించారు. జనసేన స్థాపించినప్పుడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి .. తాజాగా పోటీచేస్తానంటారని.. తనకు ముఖ్యమంత్రి సీటుపై ఆశలేదు అంటూనే.. ప్రజలను తనను సీఎం చేయాలని కోరడం ఏంటని ఎద్దేవా చేశారు... ఇలా పూటకో మాట మాట్లాడే పవన్ పై ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతోందని ఫైర్ అయ్యారు.

ఇలా శ్రీకాంత్ రెడ్డి ప్రోమోలోనే పలు సంచలన విషయాలు వెల్లడించారు. పూర్తిస్థాయి ఇంటర్వ్యూలో మరెన్ని సంచలనాలు ఉన్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రొమోను కింద చూడొచ్చు.