Begin typing your search above and press return to search.

వివాదం రాజుకుంది..టీటీడీ అంటే..తెలంగాణ తిరుపతి దేవస్థానమా?

By:  Tupaki Desk   |   22 Sept 2019 11:40 AM IST
వివాదం రాజుకుంది..టీటీడీ అంటే..తెలంగాణ తిరుపతి దేవస్థానమా?
X
కొన్ని భావోద్వేగ అంశాల విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే తిప్పలు తప్పవు. తాజాగా ప్రకటించిన టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన బోర్డులకు భిన్నంగా తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులో ఏపీతో పాటు తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. కర్ణాటక.. తమిళనాడు.. ఢిల్లీ.. మహారాష్ట్ర నుంచి పలువురు సభ్యుల్ని తీసుకోవటంపై ఏపీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యుల్ని ఎంపిక చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూను టేకప్ చేసిన రాయలసీమ పోరాట సమితి ఇప్పుడు కొత్త స్లోగన్ ను తెర మీదకు తీసుకొచ్చింది. టీటీడీ అంటే.. తెలంగాణ తిరుపతిదేవస్థానమా? అంటూ ప్రశ్నిస్తున్నారు సదరుసమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి.

తాజాగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సభ్యుల్ని వెంటనే తొలగించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు.. బోర్డు సభ్యుల విషయంపై రాయలసీమ పోరాట సమితికి బీజేపీ కూడా మద్దతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రకటించిన టీటీడీ బోర్డులో ఏడుగురు ఆంధ్రోళ్లకు అవకాశం లభిస్తే.. ఆరుగురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి చోటు లభించటం.. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వటం సరికాదన్న మాట వినిపించటమే కాదు.. ఈ అంశంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మరి.. దీనిపై ఏపీ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.