Begin typing your search above and press return to search.

సీమ ఉద్యోగులా..మీకు ప్ర‌మోష‌న్లు లేవు

By:  Tupaki Desk   |   31 March 2017 10:02 AM GMT
సీమ ఉద్యోగులా..మీకు ప్ర‌మోష‌న్లు లేవు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి పూర్తి అన్యాయం జరుగుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. రాజధాని ప్రాంతానికే అభివృద్ధి అంటూ మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ...రాయలసీమ ఉద్యోగులను జోన్‌ 4లో పెట్టారని, జోన్‌ 4 ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. వేలాది మంది ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించేందుకు మైక్‌ ఇవ్వడం లేదన్నారు. రాయ‌ల‌సీమ‌లో ప‌ని చేయ‌డ‌మే ఉద్యోగులు చేస్తున్న త‌ప్పు అవుతుందా అని శ్రీ‌కాంత్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

అభివృద్ధి విష‌యంలో బాబు స‌ర్కారు తీరు రాయ‌ల‌సీమ‌పై చిన్న‌చూపున‌కు ఉదాహ‌ర‌ణ అని శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒక ప్రాంతానికే పరిమితమవుతున్నాయని ఆయ‌న ఆరోపించారు. రాయలసీమకు స్పెషల్‌ డెవలప్‌ మెంట్‌ ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేశామని చెబుతున్నారు కానీ శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం రాయలసీమకే కేటాయించాలంటే దానికి ఎందుకు ముందుకు రావడం లేదని శ్రీ‌కాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని, కర్నూలును రెండో రాజధానిగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని ఉద్యోగాల కేటాయింపుల్లో రాయలసీమ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని ఉద్యోగులు - కాంట్రాక్టు ఉద్యోగులు - ఆర్టీసీ - అంగన్‌ వాడీ - హోంగార్డు తదితర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని శ్రీ‌కాంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా దుయ్యబట్టారు. `కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచుతామన్నారు. కానీ అవ‌న్నీ వ‌దిలేశారు. అన్నింటిని తుంగలో తొక్కి ఉద్యోగుల జీవితాలో ఆటలు ఆడుకుంటున్నారు` అని శ్రీ‌కాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు జీతాలు పెంచి వారిని రెగ్యులరైజ్‌ చేస్తే ఆ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. అదే విధంగా అంగన్‌ వాడీ ఉద్యోగులకు తెలంగాణలో రెండు రెట్లు జీతాలు పెంచారని, ఏపీలో పెంచిన జీతాలు ఇవ్వడానికి కూడ చంద్రబాబుకు మ‌న‌సు రావ‌డం లేదని శ్రీ‌కాంత్ రెడ్డి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/