Begin typing your search above and press return to search.

రాయ‌పాటి పై కేసు..కిం క‌ర్త‌వ్యం..బీజేపీని ఆశ్ర‌యిస్తారా..?

By:  Tupaki Desk   |   31 Dec 2019 2:39 PM GMT
రాయ‌పాటి  పై కేసు..కిం క‌ర్త‌వ్యం..బీజేపీని ఆశ్ర‌యిస్తారా..?
X
రాజ‌కీయ దిగ్గ‌జం - మాజీ ఎంపీ - గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. తీవ్ర చిక్కుల్లో కూ రుకుపోయారు. ఆయ‌న‌పై సీబీఐ ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసింది అదేస‌మ‌యంలో ఆయ‌న అల్లుడు - ట్రాన్స్‌ ట్రాయ్ కాం ట్రాక్టు సంస్థ‌ పైనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున న‌ర‌స‌రావు పేట టికెట్ సంపాయించుకుని పోటీ చేసిన ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం స‌హా రాష్ట్రంలో అధికారం చేతులు మార‌డంతో రాయ‌పాటి మౌనం వ‌హించార‌నేది వాస్త‌వం. అయితే, ఇంత‌లో ఉరుములు లేని పిడుగు మాదిరి గా.. రాయ‌పాటిపై సీబీఐ కేసుల పిడుగు ప‌డ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌ - గుంటూరు - విజయవాడ - బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో - కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల అనంతరం రాయపాటిపై 120(బీ) - రెడ్‌ విత్‌ 420 - 406 - 468 - 477(ఏ) - పీసీఐ యాక్ట్‌ 13(2) - రెడ్‌ విత్‌ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్ - డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస్‌ లను నిందితులుగా చేర్చారు.

రుణాల ఎగవేతపై యూనియన్‌ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ భార్గవ్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్‌ టాయ్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టారు. ఇదిలా ఉంటే ట్రాన్స్‌ ట్రాయ్ లో అక్రమాలు జరిగినట్లు యూనియన్‌ బ్యాంక్ గుర్తించింది. ట్రాన్స్‌ ట్రాయ్‌ పై ఈ అండ్‌ వై కంపెనీతో యూనియన్ బ్యాంక్ ఆడిట్ చేయించింది. 14 బ్యాంక్‌లను ట్రాన్స్‌ ట్రాయ్ తప్పు దారి పట్టించిందని యూనియన్ బ్యాంక్ తెలిపింది. ఇక‌, ఈ ఊహించ‌ని ప‌రిణామంతో రాయ‌పాటి మాన‌సికంగా - రాజ‌కీయంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీడీపీ అధికారంలో లేకపోవ‌డం - కేంద్రంలోనూ టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో రాయ‌పాటి ఇప్పుడు రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యంతీసుకుంటార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న కేంద్రంలోని బీజేపీతో చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారంతా కూడా బీజేపీకి సానుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలో రాయ‌పాటి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ? చూడాలి. మొత్తానికి రాష్ట్ర రాజ‌కీయాల్లో రాయ‌పాటి విష‌యం ఆస‌క్తిగా మార‌డం విశేషం.