Begin typing your search above and press return to search.

గుంటూరు కార్పొరేష‌న్ పీఠంపై రాయ‌పాటి క‌న్ను.. సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   20 Feb 2021 2:51 AM GMT
గుంటూరు కార్పొరేష‌న్ పీఠంపై రాయ‌పాటి క‌న్ను.. సాధ్య‌మేనా?
X
కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మేయ‌ర్ పీఠాల‌పై వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే విజ‌య‌వాడ రాజ‌కీయంతో చంద్ర‌బాబుకు త‌ల బొప్పిక‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనిని తేల్చ‌లేక‌.. త‌మ్ముళ్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేక చంద్ర‌బాబు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో వివాదం గుంటూరు రూపంలో తెర‌మీదికి వ‌చ్చింది. గుంటూరులో ఒక‌ప్పుడు రాయ‌పాటి కుటుంబం కాంగ్రెస్ త‌ర‌ఫున కార్పొరేష‌న్ ప‌గ్గాలు చేప‌ట్టింది. మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. సోద‌రుడు శ్రీనివాస్‌.. గుంటూరు మేయ‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. ప్ర‌స్తుతం రాయ‌పాటి కుటుంబం మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు కార్పొరేష‌న్‌ లో మేయ‌ర్ పీఠం ఇవ్వాల‌ని ఈ కుటుంబం చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచుతున్న‌ట్టు స‌మాచారం. అయితే.. విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠంపై గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే నిర్ణ‌యం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు గుంటూరు విష‌యాన్ని అప్ప‌ట్లో సైలెంట్ చేశారు.కానీ, ఇప్పుడు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రెడీ అయిన నేప‌థ్యంలో తాజాగా రాయపాటి నుంచి చంద్ర‌బాబుకు లేఖ అందింది. త‌మ‌కు మేయ‌ర్ ప‌ద‌వి ని కేటాయించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఆయ‌న కుమారుడు రాయ‌పాటి రంగారావును మేయ‌ర్ పీఠంపై కూర్చోబెట్టుకునేందుకు ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నారు..

అయితే.. ఇదే పీఠంపై పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా క‌న్నేశారు. పెద‌కూర‌పాడు నుంచి ఓడిపోయిన‌.. టీడీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌.. కొమ్మాల పాటి శ్రీధ‌ర్‌.. త‌న వియ్యంకుడు.. గుంటూరు జిల్లా టీడీపీ ఇంచార్జ్ జీవీ ఆంజ‌నేయులు ద్వారా చ‌క్రం తిప్పుతున్నారు. కొమ్మాల పాటి కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న త‌న స‌తీమ‌ణిని మేయ‌ర్ పీఠంపై కూర్చోబెట్టాల‌ని భావిస్తున్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మాజీ ఎంపీ, దివంగ‌త లాల్ జాన్ బాషా కుమారుడు కూడా మేయ‌ర్ పీఠంపై క‌న్నేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కుటుంబం సైలెంట్‌గా ఉంది. అయితే.. మేయ‌ర్ పీఠం త‌మ‌కు అప్ప‌గించాల‌ని తాజాగా వారు కూడా డిమాండ్‌ను లేవ‌నెత్త‌గ‌డంతో.. చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.