Begin typing your search above and press return to search.

రాయ‌పాటి.. మ‌న‌కూ వ్యాపారాలున్నాయ్ సార్?

By:  Tupaki Desk   |   26 Feb 2019 5:11 AM GMT
రాయ‌పాటి.. మ‌న‌కూ వ్యాపారాలున్నాయ్ సార్?
X
సొంత వ్యాపార ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ని ర‌కం ఏపీ రాజ‌కీయ నేత‌లు అంటూ త‌ప్పు ప‌ట్టేటోళ్లు లేక‌పోలేదు. తెలంగాణ‌తో పోలిస్తే.. ఏపీ ప్ర‌జాప్ర‌తినిధులు ప‌లువురు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తుండ‌ట‌మే దీనికి కార‌ణం. అంతేనా.. త‌మ వ్యాపార ప్ర‌యోజ‌నాల్ని రాజ‌కీయంగా తీర్చుకోవ‌టంలో ఏపీ నేత‌ల త‌ర్వాతే ఎవ‌రైనా అన్న మాట లేక‌పోలేదు. నిజానికి ఈ కార‌ణ‌మే రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైంద‌ని చెబుతారు.

తెలంగాణ నేత‌ల మాదిరి ఏపీ నేత‌లు కూడా రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. త‌మ‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసి ఉంటే ఇప్ప‌టి ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌న్న మాట లేక‌పోలేదు. ఎప్పుడూ లేని రీతిలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు తాజాగా గొంతు విప్పారు. త‌న ప్రాంతం మీద ఎంతో ప్రేమ ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే రాయ‌పాటి వారి మాట‌ల‌న్ని కూడా నిర్దిష్ట ల‌క్ష్యంతో ఉంటాయి.

రాజ‌కీయంగా ఎంతో ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. ఎప్పుడూ త‌న వ్యాపారాలు.. వాటి ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి త‌న‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం రాయ‌పాటి వారు ఏమీ చేయ‌లేద‌న్న ఆరోప‌ణ ఉంది. కీల‌క విభ‌జ‌న వేళ‌లోనూ ఆయ‌న ఆచితూచి మాట్లాడారే త‌ప్పించి.. ఎలా విభ‌జ‌న చేస్తారు? అంటూ క్వ‌శ్చ‌న్ చేయ‌లేదు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం రాయ‌పాటి వారు మాట్లాడిన మాట‌ల కోసం వెతికితే.. స‌మాచారం పెద్ద‌గా క‌నిపించ‌దు.

ఎందుకంటే.. అయ్య‌గారి దృష్టి పెట్టేదే అంత మ‌రి. అలాంటి ఆయ‌న‌కు తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద కోపం వ‌చ్చేసింది. ఇటీవ‌ల కాలంలో టీడీపీ నుంచి ప‌లువురు త‌మ్ముళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్న వైనంపై ఆయ‌న రియాక్ట్ అయ్యారు.

టీడీపీని వ‌దిలేసి జ‌గ‌న్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువ మంది కేసీఆర్ ఒత్తిడితోనే అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ న‌మ్మ‌క ద్రోహి అని.. ఒత్తిళ్ల‌కు తాము లొంగ‌మ‌న్నారు. ఏపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం వేధిస్తోంద‌ని.. అందుకే వారంతా పార్టీలు మారుతున్న‌ట్లు చెప్పారు.

ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా ఏపీలో మరోసారి ముఖ్య‌మంత్రి అయ్యేది చంద్ర‌బాబేన‌ని.. అందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు. జ‌గ‌న్ కు చందాలు ఇవ్వాల‌ని హైద‌రాబాద్ లోని ఫార్మా సంస్థ‌ల‌కు కేసీఆర్ హుకుం జారీ చేసిన‌ట్లుగా ఆరోపించారు. లేకుంటే కేసుల్లో ఇరికిస్తామ‌ని చెప్పిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి త‌మకు రూ.300 కోట్లు రావాల‌ని.. దీనిపై ఎన్నిసార్లు అడిగినా స్పంద‌న లేక‌పోవ‌టంతో కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లుగా చెప్పారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని.. కేసీఆర్ బెదిరిస్తే పోయేదేమీ లేద‌న్న మాట రాయ‌పాటి వారి నోటి నుంచి వ‌చ్చింది. ఎప్పుడూ పెద్ద‌గా నోరు తెర‌వకుండా.. తాను.. త‌న వ్యాపారాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఈ గుంటూరు పెద్ద‌మ‌నిషికి ఉన్న‌ట్లుండి కేసీఆర్ మీద కోపం వ‌చ్చింద‌న్న‌ది చూస్తే కొత్త విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఎన్నిక‌ల వేళ‌.. టికెట్ల సాధ‌న‌లోబిజీగా ఉన్న రాయ‌పాటి త‌న‌కు న‌ర‌స‌రావుపేట ఎంపీ టికెట్.. త‌న కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని కోరుతున్నారు. కేసీఆర్ ను అంత‌లా తిట్టేస్తున్న‌వ్యాపారి రాయ‌పాటికి ఆ ధైర్యం ఎలా వ‌చ్చింద‌న్న‌ది చూస్తే.. టికెట్లు క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం ఆ మాత్ర‌మైనా తిట్ట‌క‌పోతే బాగుండ‌న్న ఉద్దేశంతో తిట్టిన‌ట్లుగా చెబుతున్నారు. అయినా.. రాయ‌పాటి వారు.. మ‌న‌కేమో బోలెడ‌న్ని వ్యాపారాలు ఉన్నాయ్. ఏ రోజున ఏ ప‌ని మీద‌ కేసీఆర్ స‌ర్కారు అవ‌స‌రంప‌డుతుందో తెలీదు. అలాంట‌ప్పుడు తొంద‌ర‌ప‌డి ఒక మాట అనేయ‌టం ఎందుకు? ఇంత‌కాలం చేసిన‌ట్లే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా.. వ్యాపారం మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లే పెట్ట‌క‌.. ఉన్న‌ట్లుండి ఈ తిట్లు మ‌న‌కు అవ‌స‌ర‌మంటారా?