Begin typing your search above and press return to search.

రాయ‌పాటి విలాసం!... చంద్ర‌బాబు విలాపం!

By:  Tupaki Desk   |   2 Nov 2017 4:57 AM GMT
రాయ‌పాటి విలాసం!... చంద్ర‌బాబు విలాపం!
X
రాయ‌పాటి సాంబ‌శివ‌రావు... గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. రాష్ట్ర విభ‌జ‌న దాకా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో కొన‌సాగిన రాయ‌పాటి... రాష్ట్ర విభ‌జ‌న ఫ‌లితంతో ఆ పార్టీ కుదేలు కాగా గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా ఆ పార్టీని వ‌దిలేసి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరే నాటికే త‌న స్థానానికి సంబంధించి ప‌క్కా హామీ తీసుకున్న త‌ర్వాతే ఆయ‌న కాంగ్రెస్‌ ను వీడార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. రాజ‌కీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగుతూ వ‌స్తున్న రాయ‌పాటి పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా మ‌న‌కు తెలిసిందే. అటు రాజ‌కీయాల‌తో పాటు ఇటు బిజినెస్‌ను కూడా దిగ్విజ‌యంగానే నిర్వ‌హించుకుంటూ వ‌స్తున్న రాయ‌పాటి.... కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంద‌న్న విష‌యంతో ఏమాత్రం సంబంధం లేకుండానే త‌న ప‌నులు చ‌క్క‌బెట్టుకోగ‌లిన నేర్ప‌రిగా పేరు గాంచారు.

రాష్ట్ర ప‌రిధిలో రాయ‌పాటిని కాద‌ని ఏ ఒక్క కీల‌క ప‌నిని అయినా పూర్తి చేసే ద‌మ్మూ ధైర్యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌నే చెప్పాలి. గ‌తంలోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఉన్నా... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక ఈ ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిలంగా మారింద‌నే విష‌యం క‌ళ్ల‌కు క‌ట్టినట్టుగా క‌నిపిస్తోంది. అస‌లు రాయ‌పాటిని ప‌క్క‌న‌పెట్టేద్దాం అన్న కోణంలో చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌తి అంశంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర స్థాయిలో రాయ‌పాటికి ఉన్న ప‌లుకుబ‌డి ముందు చంద్ర‌బాబు దిగ‌దుడుపేన‌న్న వాద‌న కూడా ఇటీవ‌లే బ‌య‌టకు వ‌చ్చేసింది. ఈ కోణంలో ఇటీవ‌ల ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. రాయ‌పాటి దెబ్బ‌కు చంద్ర‌బాబు విల‌విల్లాడిపోతున్నార‌ని, రాయ‌పాటి స్పీడుకు బ్రేకులు వేసేందుకు చంద్ర‌బాబు చేస్తున్న దొడ్డిదారి య‌త్నాలు కూడా ఏమాత్రం ఫ‌లించడం లేద‌ని కూడా ఓ నాలుగు రోజుల క్రితం తేలిపోయింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఏపీ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తోంది రాయ‌పాటి ఫ్యామిలీ ఆధ్వ‌ర్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీనే. ఈ కంపెనీ ప‌నుల‌ను అప్ప‌టికే ద‌క్కించేసుకున్న రాయ‌పాటి కోస‌మే... ప్ర‌త్యేక హోదాను చంద్ర‌బాబు కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టేశార‌ని విప‌క్షం వైసీపీ ధ్వ‌జ‌మెత్తింది. విప‌క్షం - ప్ర‌జా సంఘాలు - ప్ర‌జ‌లు ఎంత‌గా నెత్తీనోరూ బాదుకున్నా కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగేలా ఒప్పుకునేందుకు బాబు స‌సేమిరా అన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ కొట్టే స‌మ‌యంలో పార్టీ టికెట్‌ తో పాటు పోల‌వ‌రం ప‌నుల‌ను రాష్ట్ర ప‌రిధిలోనే నిలిచేలా చేయాల‌న్న రాయ‌పాటి డిమాండే ఇందుకు కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ మేర‌కు రాయ‌పాటి ముందు చంద్ర‌బాబు దాదాపుగా సాగిల‌ప‌డిపోయినా... ఇప్పుడు బాబుకు రాయ‌పాటి మేకులా త‌యారైపోయారు. ఇదేదో విప‌క్షం చేస్తున్న వ్యాఖ్య కాదు. పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్ట‌రును మార్చాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు చేస్తున్న య‌త్నాల‌కు ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు ప‌డుతున్న వైనాన్ని ప‌రిశీలించే ఏ ఒక్క‌రికైనా ఇట్టే అర్థ‌మ‌య్యే బ‌హిరంగ స‌త్య‌మేన‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

ఈ స్టోరీలోని అస‌లు వాస్త‌వం అంద‌రికీ సుస్ప‌ష్టంగానే తెలిసినా... బాబును రాయ‌పాటి ఏ మేర‌కు ఇబ్బందిపెడుతున్నార‌న్న వైనాన్ని తెలిపే మ‌రో కొత్త విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారిపోయింది. గ‌త కొంత‌కాలం క్రితం త‌న స‌తీమ‌ణి చ‌నిపోవ‌డంతో బాగా నీర‌స‌ప‌డిపోయిన రాయ‌పాటి ఒకానొక స‌మ‌యంలో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి త‌ప్పుకుందామ‌ని కూడా భావించార‌ట‌. అయితే స‌రైన స‌మ‌యం చూసుకుని ఆ దిశ‌గా ఓ ప్ర‌క‌ట‌న చేద్దామ‌ని అనుచ‌ర వ‌ర్గం చెప్ప‌డంతో రాయ‌పాటి వేచి చూసే ధోర‌ణిని అవ‌లంబిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ బోర్డు) చైర్మ‌న్‌ గా ప‌నిచేద్దామ‌ని రాయ‌పాటి భావించారు. ఆ ఒక్క ప‌ద‌వి చేప‌డితే... ఇక త‌న‌కు రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా గ‌త కొంత‌కాలం నుంచి రాయ‌పాటి ప‌లుమార్లు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెడుతూనే ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న నేరుగా చంద్ర‌బాబు చెవిన వేశారో, లేదో తెలియ‌దు గానీ... మొత్తంగా త‌న మ‌న‌సులోని మాట‌ను మాత్రం బాబుకు తెలిసేలా చేసేశారు.

అయితే రాయ‌పాటితో పాటు టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ ముర‌ళీమోహ‌న్ కూడా టీటీడీ చైర్మ న్ ప‌ద‌విని కోరుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రినీ ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... క‌డ‌ప జిల్లాకు చెందిన ఓ యువ నేత‌ను ఆ ప‌ద‌వికి ఎంపిక చేశారు. అయితే బాబు ఎంపిక చేసిన నేత‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం, అస‌లు ఆయ‌న క్రిస్టియ‌న్ అని కూడా పుకార్లు వినిపించ‌డంతో ప్ర‌స్తుతానికి ఆయన నియామ‌కం నిలిచిపోయింది. అయితే టీటీడీకి పాల‌క‌మండ‌లి లేక ఇప్ప‌టికే ఆరు నెల‌ల‌వుతోంది. ఈ నేపథ్యంలోనే ధార్మిక సంస్థ‌కు పాల‌క మండ‌లిని ఏర్పాటు చేద్దామ‌ని భావించిన బాబు... క‌డ‌ప జిల్లాకు చెందిన నేత‌తో ప‌ని కానిచ్చేద్దామ‌ని భావించార‌ట‌. అయితే త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టినా... దానిని పెడ‌చెవిన పెట్టిన చంద్ర‌బాబు... క‌డ‌ప జిల్లాకు చెందిన నేతతో పాల‌క‌మండ‌లిని ఎలా ఏర్పాటు చేస్తార‌న్న కోణంలో రాయ‌పాటి త‌న‌దైన మంత్రాంగాన్ని న‌డిపిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు క‌డ‌ప జిల్లాకు చెందిన నేత‌కు సంబంధించి ఆరా తీయ‌గా... ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూడ‌టంతో సెంట్ర‌ల్ స్థాయిలో చ‌క్రం తిప్పేసిన రాయ‌పాటి చంద్ర‌బాబు స్పీడుకు బ్రేకులు వేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అంటే రాయ‌పాటిని కాద‌ని చంద్ర‌బాబు ఏ ప‌నీ చేయ‌లేరా? అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే... అలానే అనుకోవాల్సి వ‌స్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.