Begin typing your search above and press return to search.

రాయపాటి రాజీనామా చేసేస్తానంటున్నాడు

By:  Tupaki Desk   |   28 Oct 2015 4:35 AM GMT
రాయపాటి రాజీనామా చేసేస్తానంటున్నాడు
X
ఏరికోరి మరీ ఎన్నికల ముందు పార్టీ మారి తెలుగుదేశం లోకి చేరి ఎంపీగా గెలిచిన నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తన పదవికి రాజీనామా చేసే విషయంలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేయని రాయపాటి తాజాగా మాత్రం.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు. రాయపాటి నోటి నుంచి రాజీనామా మాట ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ రాయపాటి వారి అసహనానికి.. అసంతృప్తికి పార్టీ కాదు.. అధికారులని ఆయన సెలవిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆయనకు తాజాగా అధికారుల తీరు ఓ పట్టాన అర్థం కావట్లేదట.

తాను ఎంత చెప్పినా.. ఏ పనిని చేయటం లేదని.. రేపు.. మాపు అని అంటున్నారే కానీ పనులు మాత్రం కావటం లేదని.. గత పదహారునెలలుగా ఇదే పరిస్థితినెలకొందని ఆయన వాపోతున్నారు. ఇదే తీరులో జరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఏ మాత్రం సాగవని.. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పథకాలపై గుంటూరులో మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించి సమీక్షా సమావేశానికి హాజరైన రాయపాటి అసంతృప్తితో రగిలిపోయారు. జిల్లా కలెక్టర్ నుంచి వివిధ శాఖల అధికారుల వరకూ ఎవరూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించటం లేదని.. తన నియోజకవర్గంలో నీటి సమస్య ఇబ్బందిగా ఉందని వాపోయారు.

అధికారులు స్పందించకపోవటంతో చివరకు తానే సొంత డబ్బుతో ట్యాంకర్లు ఏర్పాటు చేయించినట్లుగా వెల్లడించారు. అధికారుల తీరులో కానీ మార్పు రాకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని బెదిరించిన ఆయన అధికారులు ఉలిక్కిపడేలా చేశారు. సమీక్షా సమావేశంలో పోడియం వద్దకు వచ్చి మరీ అధికారుల మీద రాయపాటి శివాలెత్తటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రితో పాటు.. అధికారులు అవాక్కు అయిన పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాల మీద ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాయపాటి తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. రాయపాటి అసంతృప్తి వెనుకున్న అసలు కారణాన్ని వెతికే పనిలో అధికారపక్షం నిమగ్నమైంది.