Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు రాయ‌పాటి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   21 Oct 2017 7:54 AM GMT
రేవంత్‌ కు రాయ‌పాటి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారే!
X
ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం న‌డుస్తున్న స‌మ‌యంలో తెలంగాణ‌ - ఆంధ్రా అన్న తార‌త‌మ్యం క‌నిపించినంత‌గా అంత‌కు ముందు ఎన్న‌డూ క‌నిపించి ఉండ‌దేమో. టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో దాదాపుగా 14 ఏళ్ల పాటు కొన‌సాగిన ఉద్యమంలో... సీమాంధ్రులు తెలంగాణ‌కు వ‌చ్చి అందిన కాడికి దోచుకుతిన్నార‌ని ప్ర‌చారం సాగింది. అంతేకాకుండా పాల‌నా ప‌గ్గాలు కూడా త‌మ చేతుల్లోనే పెట్టుకున్న సీమాంధ్రులు తెలంగాణ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన వాటిని ఎగుర‌వేసుకుపోయార‌ని కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. సీమాంధ్రులు తెలంగాణ నుంచి వెళ్లిపోతే గానీ... త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని - అప్పుడు త‌మ‌కు అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని కూడా తెలంగాణ వాదులు గొంతు చించుకున్నారు. వారి ఉద్య‌మానికి నేతృత్వం వ‌హించిన కేసీఆర్ అయితే... నోరు తెరిస్తే చాలు సీమాంధ్రుల‌ను ఎక్కి దిగారు.

స‌రే... ఉద్య‌మం ఫ‌లించింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధానిగా హైద‌రాబాదు ఉన్నా... ఓటుకు నోటు కేసు భ‌యంతో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న బిచాణాను విజ‌య‌వాడ‌కు త‌ర‌లించేశారు. ఏపీ పాల‌నా యంత్రాంగం కూడా దాదాపుగా విజ‌య‌వాడ వెళ్లిపోయింది. ఇక్క‌డిదాకా అంతా బాగానే ఉన్నా... తెలంగాణ వాదులు నాడు పేర్కొన్న సీమాంధ్ర పెట్టుబ‌డిదారులు ఏ ఒక్క‌రు కూడా హైద‌రాబాదును వీడ‌లేదు. సీమాంధ్ర‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కావ‌చ్చు - కావూరి సాంబ‌శివ‌రావు కావ‌చ్చు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. మ‌రి ఈ ఇద్ద‌రి పేర్లే ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే... రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను చివ‌రి నిమిషం దాకా అడ్డుకునే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసి... కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిన‌ట్లుగా సైలెంట్‌ గా ఉండిపోయారు. ఇక వీరి వ్యాపారాలు దాదాపుగా హైద‌రాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి.

మ‌రి తెలంగాణ అన్యాయానికి కార‌ణ‌మైన ఈ త‌ర‌హా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను తెలంగాణ నుంచి త‌రిమి కొట్టాలి క‌దా. మొన్న టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట‌నే క‌దా అన్న‌ది. తెలంగాణ ఉద్య‌మం పేరిట సీమాంధ్రుల‌ను ద్రోహులుగా చిత్రీక‌రించిన సీఎం కేసీఆర్‌... అధికారంలోకి వ‌చ్చిన తర్వాత సీమాంధ్ర‌కు చెందిన వారితోనే చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ని రేవంత్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచ‌ల‌న కామెంట్ల‌కు స‌మాధానంగా నిన్న మీడియా సాక్షిగా రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చాలా స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉన్న రాయ‌పాటి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వస్తే... ఏపీ మంత్రులు - టీడీపీ నేత‌లు కేసీఆర్‌ తో స్నేహంగా ఉండి పెద్ద పెద్ద కాంట్రాక్టులు పొందుతున్నార‌న్న రేవంత్ వాద‌న‌ను రాయ‌పాటి ఘాటుగానే తిప్పికొట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ టీడీపీ నాయకులు కాంట్రాక్టులు పొందడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఏపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రబాబు ఏమీ సిఫార్సు చేయలేదని కూడా రాయపాటి అన్నారు. కెసిఆర్ తనకు మంచి మిత్రుడని - తాను కెసిఆర్‌ ను కలిసి రూ. 5 వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు ఇవ్వాలని అడుగుతానని ఆయన సంచ‌ల‌న కామెంట్ చేశారు. మ‌రి ఈ కామెంట్ల‌పై ఇటు టీడీపీ ఏపీ నేత‌లు గానీ - అటు టీ టీడీపీ నేత‌లు గానీ ఏమంటారో చూడాలి.