Begin typing your search above and press return to search.

బీజేపీలోకి టీడీపీ ఎంపీ జంప్‌..?

By:  Tupaki Desk   |   3 May 2016 10:43 AM GMT
బీజేపీలోకి టీడీపీ ఎంపీ జంప్‌..?
X
టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. ఏ పార్టీలో ఉన్నా ఎంపీగా మాత్రం గెల‌వ‌టం ఖాయం! ఎంతో రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న సొంతం! ఏ పార్టీలో ఉన్నా ఏనాడూ త‌న‌కీ ప‌ద‌వి కావాల‌ని కోర‌ని వ్య‌క్తి! అలాంటి నాయ‌కుడికి ఉన్న ఒకే ఒక్క ఆశ టీటీడీ చైర్మ‌న్ కావాల‌ని! ఎన్నో ఏళ్లుగా ఈ అవ‌కాశం కోస‌మే ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఆయ‌న ఆశ‌ల‌న్నీ ఆడియాశ‌లే అవుతున్నాయి. ఈసారి కూడా ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్కేలా లేదు! దీంతో ఆయ‌నలో రాజ‌కీయ వైరాగ్యం ఆవ‌హించింద‌ట‌.

ఎంపీగా ఉన్నా - ఎప్పుడూ టీటీడీ చైర్మ‌న్ కావాల‌నే ఆశ తీరేలా లేక‌పోవ‌డంతో రాజ‌కీయాల నుంచే వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారట‌. ఇక టీడీపీలో ఉంటే ప‌నికాదని.. వేరే వైపు నుంచి న‌రుక్కురావాలని యోచిస్తున్నార‌ట‌. త‌న వ్యాపారాలు - కాంట్రాక్టులు నిల‌బెట్టుకునేందుకు ఇంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డిన ఎంపీ ప‌ద‌వి - టీడీపీలో చేరిన తరువాత ఎందుకూ ప‌నికిరాకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నార‌ట రాయ‌పాటి. అందుకే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

అయితే ఈ ప్ర‌క‌ట‌న వెనుక మ‌రో అర్థం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. త‌న డిమాండ్లేవీ టీడీపీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో, టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో, బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, దీంతో టీడీపీ కాళ్ల‌బేరానికొస్తుంద‌ని రాయ‌పాటి వ్యూహంగా ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే బీజేపీలో చేరుతారా అని మీడియా ప్ర‌శ్నిస్తే.. అక్కడ చేరిన వారే పనిలేక ఖాళీగా ఉన్నారని, తానెళ్లి ఏం చేస్తాన‌ని ఎదురు ప్ర‌శ్నించార‌ట‌.

ఇదే స‌మ‌యంలో ప్రధాని మోడీని రాయ‌పాటి క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 6 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటి ప‌థ‌కాల్ని మంజూరు చేయాల‌ని ప్ర‌ధానిని కోర‌గా ఆయ‌న‌ సానుకూలంగా స్పందించార‌ట‌. ఇదే విష‌యాన్ని రాయ‌పాటే వెల్ల‌డించారు. మ‌రోవైపు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌ని టీడీపీని బెదిరించేందుకే ఆయ‌న ఈ ఎత్తుగ‌డ వేశార‌ని మ‌రో ప్ర‌చారం సాగుతోంది.