Begin typing your search above and press return to search.

రాయపాటికి అనూహ్య‌మైన ప‌ద‌వి ద‌క్కిందిగా

By:  Tupaki Desk   |   11 Nov 2017 2:16 PM GMT
రాయపాటికి అనూహ్య‌మైన ప‌ద‌వి ద‌క్కిందిగా
X
సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి. రాయ‌పాటి టీటీడీ చైర్మ‌న్‌ ప‌ద‌వి కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. కానీ అది అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది. అయితే తాజాగా రాయ‌పాటికి ఓ అనూహ్య‌మైన ప‌ద‌వి ద‌క్కింది. రహదారి భద్రతా కమిటి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా రాయ‌పాటిని నియ‌మించారు! ఈమేరకు కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎంపీ రాయపాటికి లేఖ ద్వారా ఈ విషయం తెలిపారు.

అయితే రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకే...ఈ ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు టీడీపీ ఎంపీలు ఉన్నారు. జిల్లా కేంద్ర‌మైన గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జిల్లా కేంద్రానికి చెందిన ఎంపీని ప‌క్క‌న‌పెట్టి అదే జిల్లాకు చెందిన రాయ‌పాటిని ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీని వెనుక గ‌ల్లా జ‌య‌దేవ్ కంటే ఎంపీ రాయ‌పాటి సీనియ‌ర్ అనేది ఒక్క‌టే కార‌ణం కాద‌ని అంటున్నారు. కేంద్ర మంత్రి గడ్క‌రీతో ఎంపీ రాయ‌పాటికి ఉన్న దోస్తీ కూడా ఓ కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇటీవ‌ల పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాంట్రాక్ట‌ర్ మార్పు, త‌న ప‌లుకుబ‌డితో ఆ చ‌ర్య‌ను నిలిపివేయ‌డం ఉదాహ‌ర‌ణ‌గా విశ్లేషిస్తున్నారు.

కాగా, పెద్ద ఎత్తున జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టే క్ర‌మంలో ఎంపీల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వం జిల్లా ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలో గుంటూరు జిల్లాకు చెందిన క‌మిటీకి రాయ‌పాటికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సభ్యులుగా రహదారి భద్రతా కమిటీ ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై రహదారి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించ‌నుంది. భార‌త‌దేశంలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌తో అనేక మంది మ‌ర‌ణిస్తున్నార‌ని..వీటిని అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా చేప‌ట్టిన ఈ నియామ‌కాలు స‌త్ఫ‌లితాలు ఇచ్చే విధంగా మందుకు సాగాల‌ని ఎంపీ రాయ‌పాటికి రాసిన లేఖ‌లో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ సూచించారు.