Begin typing your search above and press return to search.

పాత వైరాన్ని చాప చుట్టేశారు...ఇక మిత్రులేనట

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:19 AM GMT
పాత వైరాన్ని చాప చుట్టేశారు...ఇక మిత్రులేనట
X
ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధులు. అదెలా అంటే చిత్రమే. అలాంటి చిత్రాలు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలోనే సాగుతాయి. కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్చ అటువంటిది. ఆ పార్టీలో ఉంటూ ఒకరిని ఒకరు విమర్శించుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రతీ జిల్లాలో రెండు మూడు గ్రూపులు ఉంటాయి. వారు ఒకే పార్టీలో ఉన్నా ఇతర పార్టీలో ఉన్న ప్రత్యర్ధుల కంటే కూడా దారుణంగా విమర్శలు చేసుకునే వారు. దాన్ని చూసి అంతా కాంగ్రెస్ లో ఇంతే అని భావించేవారు.

ఇలా గుంటూరు జిల్లాలో తీసుకుంటే దిగ్గజ నేతలు ఇద్దరు ఉన్నారు. ఒకరు రాయపాటి సాంబశివరావు. ఆయన ఎపుడూ ఎంపీగా గెలుస్తూ వచ్చేవారు. మరొకరు కన్నా లక్ష్మీనారాయణ. ఈయన కూడా కాంగ్రెస్ లో సీనియర్ లీడరే.

ఈయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వారు. వైఎస్సార్ జమానాలో రాయపాటి ఎంపీగా ఉంటే కన్నా మినిస్టర్. అయినా ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు అలా సాగుతూనే ఉంది.

ఆ టైం లో ఒకసారి రాయపాటి సాంబశివరావు కన్నా మీద దారుణంగా అవినీతి ఆరోపణలు చేశారు. దాని మీద తీవ్ర మనస్తాపం చెందిన కన్నా ఏకంగా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇదంతా 2010 నాటి ముచ్చట. అలా ఇప్పటికి పుష్కర కాలంగా ఈ కేసు కోర్టులో నలుగుతోంది. ఇద్దరూ వాయిదాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈ మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

కన్నా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తే రాయపాటి టీడీపీలో సర్దుకున్నారు. ఇలా ఒకే పార్టీలో లేరు. ఇద్దరూ అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఏమనుకున్నారో ఏమో కోర్టుకు వెళ్ళి ఈ వాయిదాలతో కాళ్ళ పీకులు ఎందుకు అనుకుని హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చేసుకున్నారు. తామిద్దరమూ రాజీపడుతున్నట్లుగా కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా అంగీకరించింది. దాంతో కన్నా రాయపాటీ ఇపుడు మంచి దోస్తులు అయినట్లే లెక్క.

ఇపుడు చూస్తే రాయపాటిలో మునుపటి దూకుడు లేదు. ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక కన్నా మరికొంతకాలం రాజకీయం చేయాలనుకుంటున్నారు. సో ఈ కలయిక కన్నా రాజకీయ జీవితానికి కొత్త మలుపుగా మారుతుందేమో చూడాలి.ఎందుకంటే ఆయన బీజేపీ నుంచి టీడీపీలోకి వద్దామనుకుంటున్నారు. అందులో రాయపాటి ఉన్నారు. ఇపుడు ఆయన వెల్ కం చెబుతారు కూడా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.