Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు రాయుడు బైబై.. తూచ్ అంటూ ట్వీట్ డిలీట్

By:  Tupaki Desk   |   14 May 2022 10:32 AM GMT
ఐపీఎల్ కు రాయుడు బైబై.. తూచ్ అంటూ ట్వీట్ డిలీట్
X
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు శనివారం సంచలనం రేపి తూచ్ అనేశాడు. వచ్చే ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడనని ట్వీట్ చేసిన అతడు అరగంటలోనే దానిని డిలీట్ చేశాడు. రిటైర్మెంట్ పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మేనేజ్ మెంట్ అతడితో మాట్లాడినట్లు తెలిసింది. సర్దిచెప్పడంతో రాయుడు వెనక్కుతగ్గాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలోనూ ఇలాగే గుడ్ బై చెప్పిన రాయుడు తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా,రాయుడు గతంలో లీగ్ లో ముంబై ఇండియన్స్ కు ఆడాడు. అత్యంత ప్రతిభావంతుడిగా కెరీర్ ప్రారంభంలోనే పేరు తెచ్చకున్నప్పటికీ.. తదనంతరం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. టీమిండియాకు 55 వన్డేలు, 6 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో 187 మ్యాచ్ లు ఆడాడు. 29.3 సగటుతో 4,187 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 127.3.

హైదరాబాద్ ఆణిముత్యం ఒక అజహరుద్దీన్, ఒక వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత హైదరాబాదీ మణికట్టు బ్యాటింగ్ సొగసుకు అంబటి రాయుడు పేరుగాంచాడు. 2002లో పదహారేళ్ల యువకుడిగా ఇంగ్లండ్ లో 177 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన రాయుడు.. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా పేరుతెచ్చకున్నాడు. అదే ఏడాది ఆంధ్రాతో రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ తరఫున బరిలో దిగిన అతడు డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టి తనపై అంచనాలను పెంచాడు. 2004లో అండర్ 19 టీమిండియా కెప్టెన్ గా జట్టును నడిపించాడు.

అయితే, 2005-06 సీజన్ లో హైదరాబాద్ కోచ్ తో విభేదాలతో ఆంధ్రా జట్టుకు మారాడు. మళ్లీ వెంటనే హైదరాబాద్ కు తిరిగొచ్చిన అంపైర్లతో వివాదంతో వార్తల్లో నిలిచాడు. కాగా, రాయుడు కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది 2007లో. రెబల్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ కు మళ్లిపోవడం పెద్ద దెబ్బగా మారింది. అయితే, తదనంతరం బీసీసీఐ తిరిగి తీసుకున్నా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇలాంటి సమయంలో ముంబై ఇండియన్స్ రాయుడుకు అవకాశం ఇచ్చింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రోత్సాహంతో ముంబైకి ఆడిన రాయుడు ప్రతిభ చాటాడు.

టీమిండియా కల తీరిందిలా..ముక్కుసూటితనంతో వచ్చిన వివాదాలను పక్కనబెడితే దేశవాళీల్లో అద్భుత క్రికెటర్ గా పేరున్నా.. టీమిండియాకు రాయుడు ఆడతాడా? అనే సందేహం ఉండేది. ఆ కల 2013లో ఎట్టకేలకు నెరవేరింది. జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అరంగేట్రంలోనే 63 పరుగులు చేసి అదరగొట్టాడు. 2015 వన్డే ప్రపంచ కప్ , 2016 టి20 ప్రపంచ కప్ లో జట్టు సభ్యుడైనప్పటికీ తుది 11 మందిలో లేడు. 2019 నుంచి చెన్నైతో ఐపీఎల్ లో 2017 వరకు ముంబైకి ఆడిన రాయుడు.. 2018 నుంచి చెన్నైతో కొనసాగుతున్నాడు. చెన్నై విజయాలతో పాటుచాంపియన్ గా నిలవడంలోనూ తనవంతు పాత్ర పోషించాడు.

కాగా, 2019 ప్రపంచ కప్ నకు రాయుడును ఎంపిక చేయకపోవడం పెద్ద వివాదమైంది. 4వ నంబరు బ్యాట్స్ మన్ రాయుడు నిలకడగా ఆడుతున్నా.. ఒకటీ, రెండు సిరీస్ లలో ప్రదర్శన బాగోలేదని తీసివేయడం గమనార్హం. దీనిపై అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్, తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాద్ పై రాయుడు వ్యంగ్య బాణాలు విసిరాడు. రాయుడు స్థానంలో విజయ్ శంకర్ (తమిళనాడు పేస్ ఆల్ రౌండర్)ను ఎంపిక చేసిన ఎమ్మెస్కే.. అతడిని త్రీడీ ప్లేయర్ గా అభివర్ణించాడు. దీనిని "ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలు తెచ్చుకున్నా" అంటూ రాయుడు ఎద్దేవా చేశాడు. అనంతరం ప్రపంచ కప్ లో ధావన్ గాయపడి జట్టుకు దూరమైనా రాయుడు మాత్రం అవకాశం దక్కలేదు. దీనిపై ఆగ్రహంతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాడు. దేశవాళీల్లో ఆడాడు.

సీఎస్కే కు గడ్డు రోజులు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడో తెలియడం లేదు. రైనాను తీసుకోలేదు. కెప్టెన్ గా ప్రకటించిన జడేజా తప్పుకొన్నాడు. ఇప్పుడసలు టీమ్ లోనే లేడు. వచ్చే ఏడాది అతడు చెన్నై కు ఆడకపోవచ్చన సందేహాలున్నాయి. జట్టులో చూస్తే ఉతప్ప, బ్రావో తదితరులకు వయసు పైబడింది. మొయిన్ అలీ ఆల్ రౌండరే కానీ న్యాయం చేయలేకపోతున్నాడు. అసలు ఇది చెన్నై జట్టేనా అన్నట్లు వారి ప్రదర్శన సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై పూర్తిగా జట్టును పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి తప్పేలా దు.