Begin typing your search above and press return to search.

ఆర్‌బీఐ గుడ్ న్యూస్ః రెపో రెటు త‌గ్గింపు

By:  Tupaki Desk   |   7 Feb 2019 1:42 PM GMT
ఆర్‌బీఐ గుడ్ న్యూస్ః రెపో రెటు త‌గ్గింపు
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీపిక‌బురు వ‌చ్చింది. కీలక వడ్డీ రేటును ఆర్‌బీఐ తగ్గించింది. రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వడ్డీ రేటు)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు.. ఇప్పుడు 6.25 శాతానికి తగ్గింది. ఈ తగ్గింపు కారణంగా రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. త‌ద్వారా వినియోగ‌దారుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ పావుశాతం కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ నేడు ప్రకటించింది.ఆర్బీఐ చైర్మన్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేట్ (ఆర్బీఐకి బ్యాంకులు ఇచ్చే రుణంపై వడ్డీ)ను 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్‌ను 6.5 శాతంగా ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మానిటరీ పాలసీ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలాఉండ‌గా, ఈ నెల 9న జరుగాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు సమావేశం వాయిదా పడింది. 18కి మార్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బోర్డునుద్దేశించి గోయల్ ప్రసంగించనున్నారు. కాగా, కేంద్రానికి ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్‌పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.