Begin typing your search above and press return to search.
నగదు కొరతకు ప్రజలే కారణం: ఆర్బీఐ
By: Tupaki Desk | 27 April 2018 11:32 AM GMTకొద్ది రోజులుగా దేశంలో పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అసలు చాలా ఏటీఎంలలో బ్యాంకులు డబ్బులు పెట్టడం లేదు....డబ్బులున్న ఒకటి అర ఏటీఎంల ముందు జనాలు బారులు తీరుతున్నారు. పోనీ, బ్యాంకుల్లో డ్రా చేసుకుందామా అంటే...ఖాతాదారులందరికీ సమన్యాయం చేయాలంటూ సూక్తులు చెప్పి 5 వేలో పది వేలో దానం చేసినట్లు ఇస్తున్నారు. తమ రాష్ట్రాల్లో నగదు కొరత ఉందని ప్రభుత్వాలు.... కేంద్రానికి స్పష్టం చేసినా....స్పందన లేదు. ఏదో కొన్ని చోట్ల నగదుకు ఇబ్బంది ఉందని....ఒక్కసారిగా జనం డబ్బులు డ్రా చేయడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రాను రాను పరిస్థితి విషమించుతోందని గమనించిన కేంద్రం ...ఈ విషయాన్ని ఎంచక్కా ఆర్బీఐ, ప్రజలపైకి నెట్టేసి చేతులు దులుపుకుంది.
పెద్ద నోట్ల ఉపసంహరణ సమయంలో బ్యాంకులకు వచ్చినంత నగదుకు బదులుగా కొత్త కరెన్సీని ముద్రించి పంపిణీ చేశామని కేంద్రం కొత్త కథ చెబుతోంది. ఇక ఆర్బీఐ మరో అడుగు ముందుకు వేసి....అసలు మొత్తం తప్పు ప్రజలదేనని తేల్చేసింది. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్న ప్రజలు ....డిపాజిట్ చేయడం లేదని ఆర్బీఐ కొత్త పల్లవి అందుకుంది. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం - ఆర్బీఐలు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం...అందులో ప్రజలను ఇన్వాల్వ్ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ జనం ...తమ డబ్బును డ్రా చేసుకొని ఇళ్లల్లో పెట్టుకున్నా....అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే జనాన్ని అలా చేసేలా కేంద్రం, బ్యాంకులు ప్రేరేపించాయి. బ్యాంకులో ఖాతా ఉండడమే పాపమన్నట్లు....ఆపన్ను...ఈ పన్ను వేసి వారి నడ్డి విరచాలని చూశాయి. దీంతో, తమ డబ్బును స్థిరాస్థులు - రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ తాలూకు డబ్బులుపోగా మిగిలిన లిక్విడ్ క్యాస్ ను ఖర్చులకు వాడుకుంటున్నారు జనం. మరోవైపు ఎఫ్ ఆర్డీఏ బిల్లు బూచి భయపెడుతుండడం మరో కారణం. కాబట్టి ప్రస్తుతం ఏర్పడ్డ నగదు కొరతను తీర్చేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు.