Begin typing your search above and press return to search.

మోడీ బట్టలకి.. ఆర్ బీఐకి లింకెట్టేశారు

By:  Tupaki Desk   |   20 Dec 2016 1:20 PM GMT
మోడీ బట్టలకి.. ఆర్ బీఐకి లింకెట్టేశారు
X
ప్రధాని మోడీపై ఈ మధ్య తరచూ ఫైర్ అవుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్స్ తో విరుచుకుపడ్డారు. మోడీని హుందాగా తిట్టాలంటూ పార్టీ కార్యకర్తలకు ప్రబోధించిన రాహుల్.. తాజాగా మోడీ తీరును నిశితంగా విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆర్ బీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై విరుచుకుపడిన రాహుల్.. ఈ సందర్భంగా ప్రధాని బట్టలతో లింకెట్టి మరీ తిట్టేయటం గమనార్హం.

ప్రధాని తన దుస్తులు మార్చినట్లుగానే ఆర్ బీఐ ఇష్టం వచ్చినట్లుగా రూల్స్ మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోడీ దుస్తులు మార్చుకున్నంత ఈజీగా ఆర్ బీఐ నిమిషానికో నిబంధన మార్చుకుంటూ పోతోంది’’ అని ట్వీట్ చేశారు. పలు ర్యాలీల్లో ప్రసంగించేందుకు వచ్చే మోడీ రోజంతా దుస్తులు మార్చుకుంటూ ఉంటారని.. అదే తీరులో ఆర్ బీఐ తరచూ నిబంధనల్ని మార్చేస్తుందని వ్యాఖ్యానించారు.

రూ.5వేలకు మించిన డిపాజిట్ ను సోమవారం నుంచి ఈ నెలాఖరులోపు ఒక్క ఖాతాదారు ఒక్కసారి మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటూ తాజాగా విడుదల చేసిన నిబంధనపై రాహుల్ ఫైర్ అయ్యారు. మోడీ మీదా.. ఆర్ బీఐ మీదా చురకలు వేసిన రాహుల్ తీరు చూస్తే.. మోడీ మీద తరచూ ఫైర్ కావాలన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో అప్పుడప్పడు మాత్రమే రియాక్ట్ అయ్యే ఆయన.. ఇటీవల కాలంలో ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో మోడీపై మండిపడటం గమనార్హం.

బడాబాబులు తమ దగ్గరి నల్లధనాన్ని మార్చేసుకున్నారని.. సామాన్యులు.. మధ్యతరగతి వారు మాత్రమే తమ డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి మిగిలి ఉన్నారని.. ఇలాంటి వేళ.. ఇష్టం వచ్చినట్లుగా నిబంధనల్ని ఆర్ బీఐ ఎలా మారుస్తుందంటూ మాజీ ఆర్థికమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విరుచుకుపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/