Begin typing your search above and press return to search.

మ‌న‌కోసం బ్యాంక‌ర్ల త‌లంటిన ఆర్‌ బీఐ

By:  Tupaki Desk   |   31 May 2017 4:29 AM GMT
మ‌న‌కోసం బ్యాంక‌ర్ల త‌లంటిన ఆర్‌ బీఐ
X
అడ్డ‌గోలు చార్జీల భారం మోపుతున్న ప‌లు బ్యాంకుల తీరుపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌ బీఐ) అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇటీవలి కాలంలో కొన్ని బ్యాంకులు సేవా చార్జీలను పెంచేయడం, ఖాతాల్లో కనీస నగదు నిల్వలను ఉంచాలన్న నిబంధనలతో ఇబ్బంది పెడుతుండడంపై ఆర్‌ బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌.ఎస్‌. ముంద్రా అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ అవసరాల మేరకు అందించే సేవలపై చార్జీలు వసూలు చేసుకొనేందుకు.. కనీస నిల్వ నిబంధన వాడుకొనేందుకు ఆర్‌ బీఐ బ్యాంకులకు వెసులుబాటు కల్పించిందని ఆయన అన్నారు. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని బ్యాంకులు అనూహ్యంగా చార్జీలను పెంచడం, కనీస డిపాజిట్ల పేరుతో వేధించడం సరికాదని అన్నారు. సామాన్యుడికి బ్యాంకింగ్‌ సేవలను తిరస్కరించడం, దూరం చేసే దిశగా బ్యాంకులు వాటి స్వేచ్చను వాడొద్దని ఆయన హితవు పలికారు.

ముంబైలో 'బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా' ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముంద్రా పాల్గొని ప్రసంగించారు. చార్జీల వసూళ్లు బ్యాంకులకు కీడు చేయనప్పటికీ.. కొన్ని వర్గాల వినియోగదారులను దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చార్జీలను రూపొందించడం సరికాదని అన్నారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, పాస్‌బుక్‌లలో నగదు లావాదేవీలకు సంబంధించిన కనీస వివరాలు ముద్రించేలా త్వరలోనే తగిన 'వివరణ'లను బ్యాంకులకు అందించనున్నట్టుగా ఆయన తెలిపారు. వినియోగదారుల రక్షణపై తుది మార్గదర్శకాలను భారత రిజర్వ్‌ బ్యాంక్‌ త్వరలోనే వెలువరించనుందని, అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో వినియోగదారుల బాధ్యతను పరిమితం చేస్తూ రక్షణను అందించేలా ఈ మార్గదర్శకాలు వుంటాయని ఎస్‌.ఎస్‌.ముంద్రా తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి ముసాయిదా సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిపై సూచనలు, వ్యాఖ్యలు చేయాల్సిందిగా ఆర్‌బీఐ కోరింది. సంబంధిత పక్షాల నుండి అందిన సమాచారం ప్రాతిపదికగా త్వరలోనే తుది మార్గదర్శకాలు జారీ చేస్తామని ముంద్రా వివరించారు.

ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ సర్వీసుల్లో సాంకేతికత వినియోగం బాగా పెరిగిందన్నారు. అయితే అదే సమయం లో భద్రతాపరమైన ముప్పు కూడా పెరిగిందని ముంద్రా వివ‌రించారు. వ్యక్తిగత సమాచార చౌర్యం, ఏటీఎంల వినియోగం లో అవకతవకలు, నెట్‌ బ్యాంకింగ్‌ మోసాలు వంటి సమస్యలు అనేకం పెరిగిపోతున్నాయని అన్నారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌పై ఆధారపడుతున్న సమయంలో వినియోగదారుల బాధ్యతను పరిమితం చేస్తూ సమగ్రమైన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.ఆధార్‌, 'నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' వంటి సౌలభ్యాలను ఉపయోగించుకొని 'బ్యాంక్‌ ఖాతా పోర్టబులిటీ' సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముంద్రా అన్నారు. బ్యాంకు ఖాతాలను పోర్డబులిటీ కారణంగా వినియోగదారు తమకు నచ్చిన బ్యాంకుకు ఖాతాలను మార్చుకొనే అవకాశం ఏర్పడుతుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/