Begin typing your search above and press return to search.

అమెరికా బ్యాంక్​ కు ఆర్​బీఐ షాక్​.. క్రెడిట్​ కార్డులపై ఆంక్షలు

By:  Tupaki Desk   |   25 April 2021 4:30 PM GMT
అమెరికా బ్యాంక్​ కు ఆర్​బీఐ షాక్​.. క్రెడిట్​ కార్డులపై ఆంక్షలు
X
అమెరికాకు చెందిన ఓ బ్యాంక్​పై ఆర్​బీఐ ( రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ఆంక్షలు విధించింది. సదరు బ్యాంకు ఇక నుంచి క్రెడిట్​ కార్డులు జారీ చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీచేసింది. అమెరికాకు చెందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ , డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలు మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే సదరు సంస్థలు ఆర్​బీఐ రూల్స్​కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వాటిపై ఆర్​బీఐ చర్యలు తీసుకున్నది. సదరు సంస్థలు ఇక మనదేశంలో క్రెడిట్​ కార్డులు జారీ చేయడానికి అవకాశం లేకుండా ఆదేశాలు జారీచేసింది. మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నది.

అయితే కొత్తగా క్రెడిట్​ కార్డులు జారీ చేయడానికి ఆంక్షలు విధించారు కానీ.. ఇప్పటికే జారీచేసిన కార్డులు యథావిధిగా పనిచేస్తాయని ఆర్​బీఐ పేర్కొన్నది. భారతీయ కస్టమర్ల డేటా, ఇతర సమాచారం విషయంలో అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ బ్యాంక్​ నిబంధనలు ఉల్లంఘించింది. దీంతో ఆర్​బీఐ చర్యలు తీసుకున్నది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్ 17 కింద కార్డు నెట్ వర్క్స్ ఆపరేటింగ్‌ కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పోరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలకు అనుమతి ఉంది.

చెల్లింపుల విషయం, డాటా భద్రపరిచే విషయంలో విదేశీ బ్యాంకులకు 2018లో ఆర్​బీఐ ఓ సర్క్యూలర్​ జారీ చేసింది.అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఈ రూల్స్​ ను బ్రేక్​ చేసింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్​బీఐ పేర్కొన్నది.అయితే ఈ అంశంపై అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ మాట్లాడుతూ.. ఆర్​బీఐ ప్రస్తావించిన సమస్యను పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నది. తమ కస్టమర్లకు ఇబ్బందులు ఏమీ ఉండవని పేర్కొన్నది. క్రెడిట్ కార్డులు యథాతథంగా వాడుకోవచ్చని తెలిపింది.