Begin typing your search above and press return to search.

మధ్యతరగతికి షాకిచ్చిన ఆర్బీఐ.. రెపో రేట్ ను మళ్లీ పెంచేసింది..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 11:30 PM GMT
మధ్యతరగతికి షాకిచ్చిన ఆర్బీఐ.. రెపో రేట్ ను మళ్లీ పెంచేసింది..!
X
కరోనా ధాటికి యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనించింది. గత రెండేళ్లుగా ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిత్యావసర ధరలు.. పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటండటంతో ప్రతి ఒక్కరిపై భారం పడింది.

కరోనా ప్రభావం నుంచి ప్రజలంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులు.. ఇంటి బిల్లులు.. రీఛార్జ్ బిల్లులు.. డిష్.. వాటర్.. పాలు.. గ్యాస్.. పెట్రోల్.. కూరగాయల బిల్లులతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఆర్బీఐ సైతం వ్యవహరిస్తుంది. తాజాగా కీలక రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్లు (0.35%) పెంచింది. దీంతో రెపో రేటు 6.25శాతానికి పెరిగింది. దీని ప్రభావం వల్ల గృహ.. వాహన.. ఇతర రుణాల నెలవారీ వాయిదాలు(ఈఐఎం) మరింత ప్రియంగా మారాయి. దీంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల మరికొద్ది రోజులు దూరమయ్యేలా కన్పిస్తోంది.

కోవిడ్ సమయంలో రివర్స్ రెపో రేటు 4 శాతం ఉండటం వల్ల రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించించాయి. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే కారణంతో ఏప్రిల్ నెలలో తొలిసారి రెపో రేటును పెంచింది. నాటి నుంచి విడుదల వారీగా పెంచుతూ పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వడ్డీ రేట్లు ఏకంగా 2.25శాతం మేర వరకు పెంచింది.

రెపో రేటు అమలు చేయడం వల్ల బ్యాంకులు తప్పనిసరిగా తమ గృహ రుణాల వడ్డీ రేట్లను అనివార్యం పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం రెపో రేటు 6.25శాతానికి చేరడంతో గృహ రుణాల రేటు 8.75శాతానికి చేరే అవకాశం ఉంది. అలాగే రెపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు ఈఎంఐలు పెంచడమే.. తగ్గించడమో చేస్తారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈఎంఐలు మరింత పెరగడం ఖాయం కన్పిస్తోంది.

ఒకవైపు రుణాల రేట్లను పెంచుతూ పోతున్న ఆర్బీఐ డిపాజిట్ల విషయంలో మాత్రం కనికరం చూపించడం లేదు. ప్రస్తుతం డిపాజిట్ల వచ్చే వడ్డీ ఏ మాత్రం చెప్పుకోదగిన విధంగా లేవు. దీంతో ప్రజలు డిపాజిట్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం బ్యాంకులు మూడు నుంచి ఐదేళ్ల కాలానికి డిపాజిట్లపై 6.10శాతం వడ్డీ ఇస్తున్నారు.

ప్రస్తుతం మరో 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అధికంగా వడ్డీ లభించనుంది. ఏది ఏమైనా ఆర్బీఐ పెంచి రెపో రేటు వల్ల గృహ.. వాహన. తదితర రుణాలన్నీ కూడా మరింత భారంగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.