Begin typing your search above and press return to search.

కేంద్రం సంచ‌ల‌నం..2వేల నోట్లు ముద్రణ ర‌ద్దు

By:  Tupaki Desk   |   3 Jan 2019 3:14 PM GMT
కేంద్రం సంచ‌ల‌నం..2వేల నోట్లు ముద్రణ ర‌ద్దు
X
దేశ పురోగ‌తిని మ‌లుపులు తిప్పే ప‌రిణామం అయిన నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ.2000 నోట్లకు సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నోట్ల ప్రింటింగ్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆపేసినట్లు స‌మాచారం. ఔను. జారీ చేసిన రెండేళ్లకే రూ.2000 నోటు ప్రింటింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ద ప్రింట్ కథనం ప్రకారం కేంద్ర సర్కార్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది.

నవంబర్ 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు కష్టాలను తీర్చేందుకు పెద్ద నోటును మార్కెట్లోకి వదిలారు. కానీ మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లకే రూ.2000 నోటు ముద్రణను ఆపేయడం జరిగింది. ఈ నోటుని ప్రవేశపెట్టడంపై మోడీ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్రం రూ.2000 పెద్ద నోటును లాంచ్ చేయడాన్ని ప్రతిపక్షాలతో పాటు ఆర్థిక నిపుణులు - విశ్లేషకులు సైతం తీవ్రంగా విమర్శించారు. కోటక్ మహింద్ర మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ సైతం రూ.1000 నోటును రద్దుచేసి రూ.2000 నోటును జారీ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. రూ.2000 నోట్లతో మనీ లాండరింగ్ - పన్ను ఎగవేత సులువవుతుందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఏప్రిల్ 2018లో ఆదాయపన్ను శాఖ అనేక నగరాల్లో జరిపిన దాడుల్లో రూ.2000 నోట్ల రూపంలో భారీగా నగదు బయటపడటంతో ఈ ఆరోపణ నిజమేనని తేలింది. ఆదాయపన్ను శాఖ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ప్రభుత్వం నల్లధనాన్ని నియంత్రించేందుకు రూ.1000 నోట్లను నిషేధించి ఆ స్థానంలో రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. రూ.2000 వంటి పెద్ద నోటు ద్వారా ప్రభుత్వం బ్లాక్ మనీని ఎలా నియంత్రిస్తుందనేది ఎవరికీ అర్థం కాలేదు.

2018 మార్చి నాటికి రూ.18.03 లక్షల కోట్ల నగదు మార్కెట్లో చలామణిలో ఉంటే అందులో 37 శాతం(రూ.6.73 లక్షల కోట్లు) రూ.2,000 నోట్లు కాగా - 43 శాతం(రూ.7.73 లక్షల కోట్లు) రూ.500 నోట్లు కాగా మిగిలినవన్నీ చిన్న నోట్లే. ఆగస్ట్ 2018లో జారీ చేసిన ఆర్బీఐ వార్షిక నివేదికలో 7.8 కోట్ల రూ.2000 నోట్లను 2017-18 కాలంలో సర్కులేషన్ లోకి చేర్చారు. రిపోర్ట్ ప్రకారం మార్చి 2018లో రూ.2000 నోట్ల సర్కులేషన్ తగ్గింది. మార్చి 2017తో పోలిస్తే మార్చి 2018లో రూ.2000 నోట్ల సర్కులేషన్ లో 13% తగ్గుదల కనిపించింది. మార్చి 2017లో రూ.2000 నోట్లు 50.2% సర్కులేషన్ లో ఉన్నాయి. అదే 2018లో ఇది రూ.37.3%కి తగ్గింది. రూ.2000 నోట్ ను ట్యాక్స్ ఎగ్గొట్టడం - మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని అనుమానిస్తున్న కేంద్రం ఈ నోట్ల ప్రింటింగ్ ను ఆపేసిందని సమాచారం.