Begin typing your search above and press return to search.

కాగితం లేదు..సిరా లేదు..నోట్ల ముద్ర‌ణ ఎలా?

By:  Tupaki Desk   |   19 April 2018 4:26 AM GMT
కాగితం లేదు..సిరా లేదు..నోట్ల ముద్ర‌ణ ఎలా?
X
సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న స‌మ‌స్య‌ల‌ను పాల‌కులు చాలా క్యాజువ‌ల్‌గా తీసుకుంటున్నాయ‌నేందుకు ఇదో తాజా ఉదాహ‌ర‌ణ‌. దేశ వ్యాప్తంగా తీవ్ర నోట్ల కొరతను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఏటీఎంల మొహం చూసేవారే క‌రువైన ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. అయితే దీనిపై ఆశ్చర్యకర క‌థ‌నాలు బయటికి వస్తున్నాయి. కాగితం కొరత వల్లే నగదు ముద్రణపై ప్రభావం పడుతుందని, దీంతో డబ్బు దొరకడం లేదని రిజర్వు బ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌ ఒక కథనం వెల్లడించింది. మోడీ ప్రభుత్వం అనుహ్యాంగా 2016 నవంబర్‌లో నోట్లను రద్దు చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ, ఇప్పటికీ నగదు ప్రవాహ కష్టాలు కొనసాగుతున్నాయి. కాగా మరో వారం, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామనడం గమనార్హం.

ఆర్‌బీఐ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ వెలువడిన ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం నోట్ల ముద్రణకు ఉపయోగించే ముడి సరుకు అయినా పేపర్‌, సిరా లభ్యత లేకపోవడం వల్లే కరెన్సీ డిమాండ్‌ను అందుకోలేకపోతున్నామని ఆర్‌బిఐ పేర్కొంది. కరెన్సీ పేపర్‌ దిగుమతులు 30 శాతం తగ్గాయని అంచనా. దీనికి తోడు నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీని ముద్రించాల్సి వచ్చింది. అప్పటికే పేపర్‌ కొరత ఉండటం, ఆ తర్వాత కొత్త నోట్ల ప్రింటింగ్‌ తో మొదలైన కాగితం సమస్య ఇంకా కొనసాగుతుందట. ఇప్పటికీ ఆర్‌ బిఐ దగ్గర కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉందట - ఈ ప్రభావం రూ.2000 - రూ.500 - రూ.100 నోట్ల ప్రింటింగ్‌ పై పడిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా దేశీయ ఉత్పత్తిదారులు డిమాండ్‌ కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు.నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్ల ముద్రణకు దాదాపు 20 వేల టన్నులకు పైగా పేపర్‌ అవసరముంది. ఇప్పటికీ పేపర్‌ కొరత ఎక్కువగా ఉన్న కారణంగానే ప్రస్తుత పరిస్థతి నెలకొందని అని ఓ ఉన్నాతాధికారి వివరించారు. నోట్ల రద్దుకు ముందే కరెన్సీ పేపర్‌ దిగుమతులు తగ్గిపోయాయని - 2016 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య సమయంలో 3500 టన్నుల పేపర్‌ మాత్రమే భారత్‌ కు దిగుమతి అయిందని సమాచారం. కాగా నోట్ల రద్దు నిర్ణయం అనంతరం కొత్త నోట్ల ముద్రణ పెరగడంతో కరెన్సీ పేపర్‌ కొరత మరింత పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా డిమాండ్‌ కు తగ్గట్లు - నోట్ల ముద్రణకు సంబంధించిన మిషనరీ సామర్థ్యం కూడా సరిపోవడం లేదట. అయితే అధికారులు మాత్రం మరో వారంలో అన్ని సమస్యలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు.

మ‌రోవైపు దేశంలోని ప‌లు రాష్ర్టాలు క‌రెన్సీ క‌ష్టాల‌తో అల్లాడిపోతున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు అత్యధిక నగదు కొరతను ఎదుర్కొంటుండుగా ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్‌ - మధ్య ప్రదేశ్‌ - కర్నాటక - బీహార్‌ - గుజరాత్‌ -మహారాష్ట్ర - రాజస్థాన్‌ - పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగా తాము కూడా నగదు కొరత ఎదుర్కొంటున్నట్లు చత్తీస్‌ ఘడ్‌ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌ - మహారాష్ట్ర రాష్ట్రాలు తమకు నగదు లేదని ప్రకటించాయి. వచ్చే 5 నుంచి ఏడు రోజుల్లో నగదు కొరతను పరిష్కరిస్తామని ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఎటిఎంల్లో నగదును సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగదు కొరతను అధిగమించడానికి కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎటిఎం కేంద్రాల్లో నగదును అందుబాటులోకి తేవాలని సూచించినట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఏటీఎంలు భారీ స్థాయిలో మూత‌ప‌డుతున్నాయి.నవంబర్‌ 2016లో మోడీ ప్రభుత్వం చేపట్టిన నోట్లు రద్దు ప్రభావం ఎటిఎంలపై పడింది. గతేడాది కాలంలో ప్రతీ రోజూ సగటున ఐదు ఏటీఎం కేంద్రాలు మూతపడినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గణంకాలు తెలుపుతున్నాయి. మార్చి 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఈ కాలంలో 1695 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. దేశంలో దాదాపుగా 2 లక్షల ఏటీఎంలు నమోదై ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తొలి రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు కొత్తగా 45,000 ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నోట్ల రద్దు తర్వాత కేవలం 3,000 కొత్త ఏటీఎం కేంద్రాలు మాత్రమే వచ్చాయి. బ్యాంకులు భారీగా మొండి బాకీలను ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వ విధానాల వల్ల నగదు నిల్వల సమస్యను ఎదుర్కొవడంతో ఎటిఎం కేంద్రాల్లో నగదును అందుబాటులో ఉంచలేక పోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ - బిహార్‌ లో 2017 మార్చి నుంచి డిసెంబర్‌ కాలంలో అత్యధికంగా 3 శాతం ఏటీఎంలు మూతపడ్డాయని సాక్షాత్తు ఆర్‌ బీఐ లెక్క‌లు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.