Begin typing your search above and press return to search.

ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది : RBI

By:  Tupaki Desk   |   10 April 2020 7:30 AM GMT
ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది : RBI
X
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, మళ్లీ ఒకసారి పరిస్థితులు అన్ని చక్కబడితే దేశీయ డిమాండ్, వృద్ధి పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వృద్ధి రేటును అంచనా వేయడం కష్టం అని తెలిపింది.

అంతర్జాతీయ వృద్ధి రేటుపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగా ఉందని, 2020లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తోందని, ఇది మనకూ వర్తిస్తుందని అని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇదే విషయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు మన దేశంలో 2020-21 వృద్ధిరేటు కొంత గాడిలో పడవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అభిప్రాయ పడింది. అయితే 2019-20లో రబీ సీజన్ కలిసి రావడం, అధిక ఆహారం ధరలు గ్రామీణ డిమాండ్ పెంచాయని, కీలక రేట్ల కోత వల్ల బ్యాంకు రుణ రేట్లు తగ్గాయని ఆర్బీఐ వివరించింది. రబీ అధిగ దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచుతుందని తెలిపింది. కరోనా వ్యాప్తితో మొత్తం అంచనాలు తలకిందులవుతున్నాయని వెల్లడించింది.

అంతర్జాతీయ మందగమనం, దేశీయ లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరమైన నిర్ణయాలకు కేంద్రం ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయనే విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ కష్ట కాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమని చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ నాటికి ద్రవ్యోల్భణం 2.4 శాతానికి పడిపోవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. జనవరిలో 7.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నాటికి 6.6 శాతంగా ఉందని తెలిపింది. ఇదే నేపథ్యంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ..కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోందని హెచ్చరించింది.