Begin typing your search above and press return to search.

భారత్‌ లో గూగుల్‌ పే నిషేధం ..అసలు విషయమేమిటంటే?

By:  Tupaki Desk   |   27 Jun 2020 3:00 PM GMT
భారత్‌ లో గూగుల్‌ పే నిషేధం ..అసలు విషయమేమిటంటే?
X
ప్రముఖ ఆన్ ‌లైన్‌ చెల్లింపుల యాప్‌ గూగుల్‌ పే ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధించిందని ఇటీవల కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ పీసీఐ) తాజాగా క్లారిటీ ఇచ్చింది. గూగుల్‌ పేను ఆర్బీఐ నిషేధించలేదని స్పష్టం చేసింది.

గూగుల్‌ పే చట్టబద్ధమైనది. దీని ద్వారా జరిగే లావాదేవీలు సురక్షితమైనవేనని ఆర్బీఐ నిర్ధారించింది అని ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే గూగుల్‌ పేను ఆర్బీఐ ధ్రువీకరించలేదంటూ అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌కు ఆర్బీఐ నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ.. గూగుల్ పే ఏ విధమైన పేమెంట్ సిస్టమ్‌ ని నిర్వహించడం లేదని, అందుకే సంస్థ పేరు అధికారిక ఆపరేటర్ల జాబితాలో లేదని తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు గూగుల్‌ పేకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఇక ఈ వివరణను సరిగా అర్థం చేసుకోని కొందరు గూగుల్‌ పేను ఆర్బీఐ నిషేధించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.