Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : EMI లు కట్టాల్సిన పనిలేదు!

By:  Tupaki Desk   |   27 March 2020 6:35 AM GMT
కరోనా ఎఫెక్ట్ : EMI లు కట్టాల్సిన పనిలేదు!
X
కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌ డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకు ఈఎంఐలు 3 నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల బ్యాంకుల నెల వాయిదాలపై ఆర్బీఐ మారిటోయం విధించింది. దీనికిందకు టర్మ్ లోన్స్ తో పాటు అన్ని రకాల నెల వాయిదాలు ఉన్నాయి. ఈ నిబంధన అటు కమర్షియల్ - రీజనల్ - రూరల్ - నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది.

దీని ప్రకారం ... మారిటోరియం కాలంలో మీ వేతనం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ కాదు. ఇలా మూడు నెలల పాటు మీరు వాయిదా కట్ అవ్వని డబ్బుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆ మొత్తం వినియోగ దారులకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మూడు నెలల తరువాత మళ్లీ ఈఎంఐలు చెల్లించాలి. గృహ - వాహన - పర్సనల్ లోన్స్ తీసుకునే వినియోగ దారులకు ఆర్బీఐ ప్రకటన వరమనే చెప్పాలి. నెల ప్రారంభంలోనే వేతనం పడగానే ఈఎంఐ రూపేణా బ్యాంకులు వారి వేతనాన్ని వాయిదాల్లో ఆటోమేటిగ్గా జమచేసేసుకుంటాయి. ఈ ఊరటతో వినియోగదారులకు మూడు నెలల పాటు ఈఎంఐ డబ్బు సేవ్ అవుతుందనే చెప్పాలి.

ఈఎంఐలు కట్టని పక్షంలో సిబిల్ స్కోర్‌ పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఇవాళ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్‌ బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరంగా - పటిష్టంగా ఉందని, ద్రవ్యోల్బణం సహా ఇతర అంశాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. మున్ముందు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకి సహకరిద్దాం అని అయన పిలుపునిచ్చారు. అలాగే 150 మంది ఆర్బీఐ ఉద్యోగులు క్వారం టైన్ లో ఉన్నారని చెప్పారు.