Begin typing your search above and press return to search.

ఓటు రాజ‌కీయంలో మోడీ వ‌ర్సెస్ కేజ్రీ

By:  Tupaki Desk   |   21 Nov 2016 7:33 AM GMT
ఓటు రాజ‌కీయంలో మోడీ వ‌ర్సెస్ కేజ్రీ
X
త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు త‌మ ఓటు బ్యాంకు ఎత్తుగ‌డ‌ల‌కు ప‌దును పెడుతున్నాయి. గంప‌గుత్త‌గా ప‌డే ఓట్లకు కేంద్ర‌మైన ద‌ళితులు - ముస్లింల‌ను ఆక‌ట్టుకునేందుకు అధికార బీజేపీ - ప్ర‌తిప‌క్ష ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజాగా ఆ రెండు పార్టీల నిర్ణ‌యాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయ‌ని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ముస్లింలను ఆర్థికంగా చేయూతనివ్వడానికి బీజేపీ సార‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంట్లోభాగంగా ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లోనే ఇస్లామిక్ విండోను ఏర్పాటు చేయాలన్న ఆర్‌బీఐ ప్రతిపాదనపై దృష్టిసారించింది. ఈ విండో ద్వారా వడ్డీరహిత రుణాలు అందించి ముస్లింలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ‌రోవైపు ద‌ళితుల‌కు ప్ర‌త్యేకంగా మేనిఫెస్టో విడుద‌ల చేసేందుకు ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ సిద్ధ‌మ‌య్యారు.

వెనుకబడిన పేద ముస్లింలను ఆర్థికంగా ఆదుకోవడంలో భాగంగా వడ్డీ లేని రుణాలు అందించడానికి ఇస్లామిక్ విండో పేరుతో ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడైంది. ఆర్‌ బీఐ చేసిన ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి తొలి దశలోనే ఉన్నా.. పథకం అమలుపై సాధ్యసాధ్యాలను అటు కేంద్రం - ఇటు రిజర్వు బ్యాంక్ సీరియ‌స్ గానే పరిశీలిస్తున్నాయి. "ముస్లింలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలన్నది మా ఉద్దేశం. కానీ ఇందులో రెగ్యులేటరి - పర్యవేక్షణ వంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. దీంతో పాటు ఈ పథకాన్ని అమలు చేసే అనుభవం భారతీయ బ్యాంకులకు లేదు. రాబోయే రోజుల్లో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ ను క్రమంగా పెంచుకుంటూ పోతాం. ముందుగా బ్యాంకింగ్‌ కు అనువుగా ఉండే సులభమైన పథకాలను ఈ విండో ద్వారా ప్రవేశపెడతాం. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే మేం ఈ విండో అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం" అని ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఆర్‌ బీఐ పేర్కొంది.

ఇదిలాఉండ‌గా ఇస్లామిక్ బ్యాంకింగ్ పూర్తిగా ముస్లిం చట్టాలకు లోబడి పని చేస్తుందని వెల్లడించింది. ఈ పథకంలో రుణాలు తీసుకున్నా, ఆస్తులను తాకట్టు పెట్టినా ఎలాంటి వడ్డీ వసూలు చేయబోమని, ఇందులో భాగంగా వచ్చే నిధులను ఇతర వాటితో కలుపబోమని తెలిపింది. ఇస్లామిక్ విండోను ఏర్పాటు చేయడానికి ముందు న్యాయ, సాంకేతిక, రెగ్యులేటరిల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఈ విండోకు సంబంధించిన టెక్నికల్ నివేదికను కూడా తయారు చేసిన ఆర్‌బీఐ దాన్ని ఆర్థిక శాఖకు పంపించింది. కేంద్రం దీనికి ఆమోద ముద్ర వేసిన తర్వాతనే భారత బ్యాంకింగ్ రంగాన్ని అనుసరించి ఇతర మార్గదర్శకాలను ఆర్‌ బీఐ రూపొందించనుంది.

కాగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ - పంజాబ్ శాస‌న సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ దళితుల కోసం ఆమె ఆద్మీ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఒక మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. పంజాబ్‌ జనాభాలో దాదాపు 32 శాతం దళితులే ఉన్న కారణంగా ఆయన వారికి విడిగా ఒక మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మ్యానిఫెస్టో ఇంతవరకు ఏ పార్టీ చేపట్టలేదు. రాష్ట్రంలో పది రోజుల ప్రచార కార్యక్రమాలను కేజ్రీవాల్‌ ఆదివారం ప్రారంభించారు. దళితులపై సాగుతున్న దౌర్జన్యాలను - వారి పట్ట కొనసాగుతున్న వివక్షను ప్రధాన అంశంగా ఈ మ్యానిఫెస్టోలో కేజ్రీవాల్‌ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దళిత వర్గానికి చెందిన ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు జరిగాయని, వారి నుంచి వినూత్నమైన సూచనలు, సలహాలు అందాయని పార్టీ ప్రతినిధి దుర్గేశ్‌ పాఠక్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ పంజాబ్‌ పర్యటనలో ఈ మ్యానిఫెస్టో ప్రధాన అంశంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా పెద్ద‌ నోట్ల రద్దు అంశం కూడా ప్రస్తావనకు రానున్నది. త్వరలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌ - బీజేపీలతో ఆప్‌ కూడా ముక్కోణపు పోటీలో తలపడుతోంది. బీజేపీని దళిత వ్యతిరేక పార్టీగా ఆప్‌ విమర్శలు సంధించనుంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/