Begin typing your search above and press return to search.

ముందే కాదు.. తర్వాతా చెప్పమంటున్న ఆర్బీఐ!!

By:  Tupaki Desk   |   26 Dec 2016 11:25 AM GMT
ముందే కాదు.. తర్వాతా చెప్పమంటున్న ఆర్బీఐ!!
X
నోట్ల రద్దు నిర్ణయం అమలు విషయంలో ఆర్బీఐ, మోడీ అండ్ కో పూర్తిగా గోప్యత పాటించారని బీజేపీ నేతలంతా చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే నవంబరు 8కి ముందు బీజేపీ నేతల అకౌంట్స్ అన్నీ చెక్ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వాటిపై ప్రభుత్వం స్పందించలేదనుకోండి అది వేరే విషయం! అయితే తాజాగా ఈ విషయం వెళ్లడించడానికి ముందు గోప్యత పాటించారు సరే.. ఇప్పటికే ఈ డీమోనిటైజేషన్ గురించి ప్రజలందరికీ తెలిసింది కాబట్టి ఆ చర్యలు తీసుకోవడానికి జరిగిన చర్చల వివరాలు తెలపాలని ఆర్బీఐ కు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు వచ్చింది.

వెంకటేష్‌ నాయక్‌ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు "డీమానిటైజేషన్ పై చర్యల వివరాలు చెప్పాలి" అని దరఖాస్తు చేశారు. అయితే ఈ విషయాలపై స్పందించిన ఆర్బీఐ.. సెక్షన్‌ 8(1)ఏ కింద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశ వివరాలను వెల్లడించలేమంటూ స్పష్టం చేసింది. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించే సమాచారం వెల్లడించకుండా ఆ సెక్షన్‌ అవకాశం కల్పిస్తోందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

అయితే ఈ విషయాలపై స్పందించిన వెంకటేష్... డీమానిటైజేషన్ నిర్ణయం ప్రకటించడానికి ముందు గోప్యత పాటించడంలో అర్ధం ఉంది కానీ.. ఇప్పుడు కూడా ఆ విషయాలు వెల్లడించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ నిర్ణయం వల్ల కోట్లాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ విషయంపై గోప్యత పాటించడం సరికాదని అభిప్రాయపడుతున్నాడు. ఏది ఏమైనా... ఈ నిర్ణయాలకు సంబందించిన చర్చల వివరాల విషయంలో మాత్రం ఆర్బీఐ మరో మాట లేకుండా.. వెల్లడించేది లేదని తేల్చి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/