Begin typing your search above and press return to search.

ఆ బ్యాంక్ లో ఖాతా ఉన్నోళ్లందరికి ఆర్ బీఐ భారీ షాక్

By:  Tupaki Desk   |   24 Sep 2019 2:30 PM GMT
ఆ బ్యాంక్ లో ఖాతా ఉన్నోళ్లందరికి ఆర్ బీఐ భారీ షాక్
X
సూటిగా పాయింట్లోకి వచ్చేస్తాం. మీకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? అయితే.. రానున్న ఆర్నెల్లు మీకు తిప్పలు తప్పనట్లే. ఒకవేళ మీకు లేకున్నా మీ సన్నిహితులు.. తెలిసినోళ్లకు అకౌంట్ ఉన్నా.. వారిని అలెర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే.. ఈ బ్యాంకు మీద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా భారీ ఆంక్షల్ని విధించింది. ఆర్నెల్లు పాటు సాగే ఈ ఆంక్షల్లోకి వెళితే.. తాజా ఆదేశాల ప్రకారం ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ఖాతాదారులు.. డిపాజిట్లదారులు ఎవరైనా సరే.. వెయ్యి రూపాయిలకు మించిన విత్ డ్రా చేసుకునే అవకాశం లేదని తేల్చింది. అయితే.. ఈ వెయ్యి రూపాయిల విత్ డ్రా ఆర్నెల్ల కాలంలోనా? లేక.. నెలకు ఒకసారా? అన్న దానిపై స్పష్టత లేదు.

దాదాపు 35 ఏళ్ల క్రితం (1984లో) ప్రారంభమైన ఈ బ్యాంకుకు ఆరురాష్ట్రాల్లో మొత్తం 137 బ్రాంచులు ఉన్నాయి. టాప్ టెన్ కోపరేటివ్ బ్యాంకుల్లో ఉన్న ఈ బ్యాంకు మహారాష్ట్ర.. ఢిల్లీ..కర్ణాటక.. గోవా.. గుజరాత్.. రెండు తెలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్ లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుండటం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నా.. రూ.వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరని ఆర్ బీఐ తేల్చింది. దీంతో ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వేలాది మంది ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వీలుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం సెక్షన్ 35ఎ కింద ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్ బీఐ వెల్లడించింది.

పొదుపు ఖాతా కానీ కరెంటు ఖాతా కానీ.. బ్యాంకులో ఏ ఖాతా ఉన్నా.. డబ్బులు విత్ డ్రా చేయాలంటే మాత్రం వెయ్యికి మించి అవకాశం లేనట్లే. అదే సమయంలో రుణాలు ఇచ్చే సదుపాయాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ ఇచ్చిన ఆర్నెల్ల గడువులోనే పరిస్థితిని తాము చక్కదిద్దుతామని బ్యాంకు ఎండీ జాయ్ థామస్ వినియోగదారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

తాజా పరిస్థితి తమ కస్టమర్లందరికి గడ్డు పరిస్థితి అని.. ఈ కష్ట సమయానికి అందరికి తాము క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తాము అధిగమిస్తామని చెబుతున్నారు. సారీలు ఎన్ని చెప్పినా.. బ్యాంకులో డబ్బులున్నోళ్లు వెయ్యికి మించి విత్ డ్రా చేయలేని దుస్థికిలోకి వెళ్లిపోవటానికి మించిన షాక్ ఇంకేం ఉంటుంది చెప్పండి?