Begin typing your search above and press return to search.

కూలీకి వెళితే 500..క్యూలో నిలుచుంటే 2వేలే

By:  Tupaki Desk   |   11 Nov 2016 10:30 PM GMT
కూలీకి వెళితే 500..క్యూలో నిలుచుంటే 2వేలే
X
‘‘మన డబ్బులు మనం తీసుకోవటానికి కూడా ఇదేం తిప్పలు. బ్లాక్ మనీ రాయిళ్లంతా తమకున్నపలుకుబడితో ఏం చేయాలో అది చేసుకుంటారు. మనలాంటి సామాన్యులకే తిప్పలన్నీ’’ అని తన ఆవేదనకు ఆగ్రహాన్ని కలగలిపి మండిపడిందో మహిళ. విశాఖపట్నానికి చెందిన ఈ మహిళ ఒక టీవీ ఛానల్ వారితో మాట్లాడుతూ.. మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వటానికి ఇదెక్కడి కండీషన్లు? అంటూ ఫైర్ అయ్యారు. నిజమే.. ఆమె ఆగ్రహంలో ధర్మం ఉందని చెప్పాలి. పెద్దనోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం ప్రకటించిన గంటల్లో అమల్లోకి తీసుకొచ్చినా..దాన్నిప్రకటించటానికి ముందు కొన్ని నెలల తరబడి ఎంతో కసరత్తు చేయటాన్ని మర్చిపోకూడదు.

మరి.. అంత కసరత్తే చేసినప్పుడు.. సామాన్యులు పడే ఈతి బాధలేంటి? వారికి ఇబ్బందుల్లేకుండా ఎలా చూడాలి? లాంటి వాటిపైదృష్టి పెట్టాల్సింది. కానీ.. అదేమీ లేకుండానే ప్రధాని మోడీ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారన్నట్లుగా ఉంది తాజా వ్యవహారం చూస్తుంటే. రెండు రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల్లో చాంతాడంత క్యూలు ఉండటం.. గంటల కొద్దీ టైం బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవటానికి వెయిట్ చేయాల్సి రావటం చూస్తే.. జనాలకు ఇబ్బంది కలగకుండా చేయటంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందనటంలో సందేహం లేదు.

తాజాగా.. నెలకొన్నపరిస్థితితోనే సామాన్యుడు చిరాకు పడిపోతుంటే..తాజాగా ఆర్ బీఐ ఇచ్చిన వివరణ వింటేనే మరింత మంట పుట్టేలా ఉండటం గమనార్హం. శుక్రవారం నుంచి ఏటీఎంలు ప్రారంభించిన సందర్భంగా ఆర్ బీఐ వివరణ ఇస్తూ.. కొత్త నోట్ల పంపిణీకి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఏటీఎంలలో ఒక్కో కార్డు పైన రోజుకు రూ.2వేల వరకు విత్ డ్రా చేయటానికి వీల్లేదని.. ఈ నల 18 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేయటం గమనార్హం. ఇప్పటికే చేతిలో ఉన్న డబ్బులతో ఆచితూచి ఖర్చు చేస్తూ.. బతుకీడుస్తున్న కోట్లాది మందికి తాజాగా ఆర్ బీఐ ప్రకటన శరాఘాతంగా మారుతుందనటంలో సందేహం లేదు.

ఎందుకంటే.. ఈ నెల 18 వరకు అంటే.. ఇంకా ఎనిమిది రోజులు ఉన్నాయి. ఈ ప్రకటనతో డబ్బుల అవసరం ఉన్నోళ్లంతా ఏటీఎంల వద్ద బారులు తీరటం ఖాయం. ఇప్పటికే బ్యాంకుల దగ్గర తీరిన బారులు..కొత్త సినిమా టిక్కెట్ల కోసం ఎలాంటి ప్రయాసలు ఉంటాయో అలాంటి పరిస్థితే ఉంది. గంటల కొద్దీ క్యూలో నిలుచోవటం ఎందుకన్న ఉద్దేశంతో చాలామంది మరో రెండు మూడు రోజులు సర్దుబాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.అలాంటి వారికి మరో ఎనిమిది రోజుల పాటు పరిమిత మొత్తంలోనే (రోజుకు రూ.2వేలే) డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో.. ఇక ఏటీఎంల చుట్టూ నిత్యం ప్రదక్షిణాలు చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితి అందరికి ఉన్న నేపథ్యంలో ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరటం ఖాయం.

ఆర్ బీఐ ప్రకటన ప్రకారం ఈ నెల 18 వరకూ రోజుకు రూ.2వేలు మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక.. 18 తర్వాత మాత్రం రోజుకు రూ.4వేల వరకూ డ్రా చేసే వీలుంది. ఇక.. డిసెంబరు30 వరకు పాత పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని.. ఈ విషయంలో ప్రజలు ఓపిక.. సహనం వహించాలని కోరుతున్నారు. ఇకపోతే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కాస్త పెద్ద మొత్తంలో డ్రా చేసుకోవాలంటే రూ.10వేలు మాత్రం తీసుకునే వీలు ఉంది. అది కూడా వారంలో రూ.20వేలకు మించటానికి వీల్లేదు.

ఇదంతా చూసినప్పుడు మనసులో చప్పున ఒక ఆలోచన రావటం ఖాయం. రోజు కూలీకి వెళితే (ఎనిమిది గంటలు) వచ్చేది రూ.500.. అదే ఏటీఎంల దగ్గర కానీ.. బ్యాంకుల దగ్గర కానీ క్యూలో నిలుచుంటే రోజుకు వచ్చేది రూ.2వేలే. క్యూలో కనీసం 2 గంటల నుంచి 3 గంటల వరకూ పట్టే పరిస్థితి. మనం బ్యాంకుల్లో దాచుకున్న మన డబ్బుల్ని తిరిగి తీసుకోవటం కంటే కూడా కూలీకి వెళితే.. నాలుగు రూపాయిలు గిట్టుబాటు అవుతాయనటంలో సందేహం లేదు. వారం పాటు కూలీకి వెళితే వచ్చేది రూ.3500 అయితే.. బ్యాంకుల్లో క్యూల్లో నిలుచొని.. నిలుచొంటే మనం దాచుకున్న డబ్బులు వచ్చేది కేవలం రూ.20వేలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి క్యూలో నిలుచోవటం బెటరా? కూలీకి వెళ్లటం బెటరా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/